*అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి – ఆరుతడి పంటలే శ్రేయస్కరం..
*కొండాపురం, నెర్మట గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు.
ప్రతి పక్షం చండూరు నవంబర్ 07: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండి, అందుబాటులో ఉన్న కొద్ది నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ రైతులకు సూచించారు.శనివారం నాడు మండల పరిధిలోని *కొండాపురం మరియు నెర్మట గ్రామాలలో ఎల్ నినో నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రత్యేక సభలకు ఆయన హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“ఎల్ నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్ లో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. భూగర్భ జలాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యత ఆధారంగానే పంటల ఎంపిక చేసుకోవాలి.”
అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా శనగ, జొన్న, పెసర, మొక్కజొన్న, మినుము, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.
రైతులు తమ భూముల స్వభావం, నేలలో తేమ, అందుబాటులో ఉన్న నీటి వనరులు, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. పంటల ఎంపికలో సందేహాలు ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు గిరి లింగస్వామి, నారపాక వసంత ధనయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, ఇతర గ్రామస్థాయి అధికారులు మరియు గ్రామాల రైతులు పాల్గొన్నారు.































