*కమిట్మెంట్ ఉన్న బిక్షం గౌడ్ లాంటి వ్యక్తులకు రిటైర్మెంట్ ఉండదు.
*సమాజంలో అవినీతి అంతమయ్యే వరకూ పేదలకు న్యాయం జరగదు.
*బీసీ బిడ్డలకు కాంగ్రెస్ ఎల్లప్పుడు అండగా ఉంటుంది..
*వెనుకబడిన నియోజకవర్గాలకు న్యాయం చేయాలి
*మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు.. మాకెందుకు నిధులు రావు?”
*కొడంగల్‌తో పాటు వెనుకబడిన నియోజకవర్గాలను సమానంగా చూడాలి.. సీఎం, మంత్రులకు విజ్ఞప్తి
*సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ సభలో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ధ్వజం!
ప్రతిపక్షం మునుగోడు, నవంబర్ 07: కమిట్మెంట్, కృషి, పట్టుదలతో పనిచేసే వ్యక్తులకు సమాజంలో ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదని, అలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు సమాజ సేవకు ముందుకు రావాలని మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.మునుగోడులోని పిఆర్ఆర్ గార్డెన్లో నిర్వహించిన పిఆర్టియు టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు, మునుగోడు ఎంపిపిఎస్ ప్రధానోపాధ్యాయులు సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ మహోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిక్షం గౌడ్ దంపతులను ఘనంగా సన్మానించి, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ
*కృషి, పట్టుదలకు మారుపేరు బిక్షం గౌడ్:
ఉపాధ్యాయుడిగా సుంకరి బిక్షం గౌడ్ అందించిన సేవలు అసమానమైనవి. కమిట్మెంట్తో పనిచేస్తూ, ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచిన ఘనత ఆయనది. నీలాంటి నిబద్ధత గల వ్యక్తి సమాజానికి సేవ చేయాలని బిక్షం గౌడ్‌కు మొట్టమొదట చెప్పిన వ్యక్తిని నేనే.
*బీసీలకు పెద్దపీట – కాంగ్రెస్ పేదల పార్టీ:
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన ఉంటుంది. బీసీలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే, బీసీ బిడ్డ అయిన సుంకరి బిక్షం గౌడ్ గారికి పిఆర్టియు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని నేను స్వయంగా ప్రయత్నం చేశాను. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, వారి నిర్ణయానికే దీనిని వదిలేస్తున్నాం.
*అవినీతి రహిత పాలనతోనే పేదలకు న్యాయం:
సమాజంలో అవినీతి వేళ్లూనుకుపోతోంది. అవినీతిని పూర్తిగా పారద్రోలేంత వరకు పేదలకు న్యాయం జరగదు. నాయకుడనేవాడు నీతిగా ఉంటేనే సమాజానికి నీతివంతమైన పాలన అందుతుంది. నాయకులు అవినీతికి పాల్పడితే పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు.
*మునుగోడు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి:
కొడంగల్‌లో సీఎం గారు రూ. 9,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడాన్ని నేను తప్పుపట్టడం లేదు, కొడంగల్‌కు నిధులు ఇవ్వొద్దనేది నా ఉద్దేశం కాదు. కానీ, ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ మహమ్మారితో బాధపడిన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన మాకుంది. మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు? మాకెందుకు నిధులు రావు?
*వెనుకబడిన నియోజకవర్గాలను సమానంగా చూడాలి:
ముఖ్యమంత్రి, మంత్రులు అందరు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను సమానంగా చూడాలి. మునుగోడు అభివృద్ధి నిధుల కోసం ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను చాలాసార్లు కలిసి విజ్ఞప్తి చేశాను. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మునుగోడుతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన నియోజకవర్గాలను గుర్తించి, తగిన నిధులు కేటాయించి న్యాయం చేయాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
































