వర్షాభావానికి ముందస్తు చర్యలు.. అధికారులకు రేవంత్ సీఎం ఆదేశాలు

ప్రతిపక్షం, జూన్ 02: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నదుల్లో రావాల్సిన నీటి వాటా పూర్తిగా దక్కేలా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో వ్యవసాయం, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, విపత్తు నిర్వహణ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎగువ రాష్ట్రాలు తమ జలాశయాలు నిండిన తర్వాత మాత్రమే నీటిని విడుదల చేస్తే తెలంగాణకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ముందస్తుగా చర్చించి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను నిర్ధారించుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి, ప్రాణహిత నదుల్లో వచ్చే వరద నీటిని సద్వినియోగం చేసుకునేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వ్యవసాయ శాఖ అధికారులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీరు అవసరమయ్యే పంటలు, పంటల మార్పిడి విధానాలపై రైతు వేదికల ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

వర్షాలు తక్కువగా కురిసినా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌తో పాటు పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని చెప్పారు.

అదేవిధంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని, విపత్తుల సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Spread the love

Related News

Latest News