సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య.. మేడిపల్లిలో విషాదం

ప్రతిపక్షం, జూన్ 11: హైదరాబాద్ నగర శివారులోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాచవానిసింగారానికి చెందిన 27 ఏళ్ల యువకుడు భార్గవ్ చారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో తన చేసిన తప్పులపై బాధ వ్యక్తం చేస్తూ, ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, భార్గవ్ కొంతకాలంగా మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో తండ్రి గదికి వెళ్లి చూడగా, భార్గవ్ ఉరేసుకుని కనిపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు గుర్తించారు. గదిలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరిస్తూ కేసును విచారిస్తున్నారు. యువకుడి అకాల మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది.

Spread the love

Related News

Latest News