[t4b-ticker]

తెలంగాణలో నక్సలిజం దాదాపు అంతం.. ఇప్పుడు ప్రధాన సవాలు డ్రగ్సే: డీజీపీ సీవీ ఆనంద్

ప్రతిపక్షం, ఆగస్టు 09: తెలంగాణలో నక్సలిజం దాదాపు పూర్తిగా అంతరించిపోయిందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. వరంగల్‌లో పర్యటించిన ఆయన పలు అంశాలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నక్సల్స్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతల పరంగా కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వ్యాప్తి ప్రధాన సమస్యగా మారుతోందని తెలిపారు. డ్రగ్స్‌ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించి కొత్త వ్యూహాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. యువత డ్రగ్స్‌ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలతో పాటు అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అలాగే ఈగల్‌ బృందాల పనితీరు, సైబర్‌ భద్రతపై కూడా సమీక్షిస్తున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. పెరుగుతున్న సైబర్‌ నేరాలను అరికట్టేందుకు పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.

రోడ్డు భద్రత, ఆహార భద్రతకు సంబంధించిన అంశాలను సమన్వయం చేసేందుకు ‘టీ-సేఫ్‌’ యాప్‌ను రూపొందిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సాంకేతికతను వినియోగించుకుని నేరాలను నియంత్రించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Spread the love

Related News

Latest News