తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎక్స్ ఖాతా హ్యాక్

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 09: సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ భద్రత కోసం పనిచేసే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCB) అధికారిక ఎక్స్ (X) ఖాతా హ్యాక్‌కు గురికావడం కలకలం రేపుతోంది. మే 22న జరిగిన ఈ ఘటన దాదాపు 20 రోజుల పాటు అధికారుల దృష్టికి రాకపోవడం చర్చనీయాంశమైంది. విషయం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై ఖాతా భద్రత పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

దేశంలోనే అత్యుత్తమ సైబర్ భద్రతా సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిన TSCB, సైబర్ మోసాల నియంత్రణ, అవగాహన కార్యక్రమాలు, హ్యాకింగ్ కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి సంస్థకే చెందిన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ కావడం భద్రతా వ్యవస్థల పనితీరుపై సందేహాలకు తావిస్తోంది.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సైబర్ భద్రతకు మార్గనిర్దేశం చేసే సంస్థే తన ఖాతాను రక్షించుకోలేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. హ్యాకింగ్ ఎలా జరిగింది? భద్రతలో ఎలాంటి లోపాలు చోటుచేసుకున్నాయి? అనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Spread the love

Related News

Latest News