*మర్రిగూడ సర్వసభ్య సమావేశంలో కేంద్రానికి డిమాండ్ – రైతుకు రూ.30 వేల సాయం ఇవ్వాలి.
*మిషన్ భగీరథ తాగునీరు, లోవోల్టేజీ, బెల్టు షాపులపై సర్పంచుల ఆవేదన.
ప్రతిపక్షం, మర్రిగూడ సెప్టెంబర్ 22 : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం మర్రిగూడ మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాభావం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి రైతుకు రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు.అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
*సర్పంచుల సమస్యల వెల్లువ..
మండలంలోని పలు గ్రామాల్లో లోవోల్టేజీ, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఎరగండ్లపల్లి, వట్టిపల్లి, కొట్టాల, రాంరెడ్డిపల్లి సర్పంచులు సంతోష్ యాదవ్, లప్పంగి నరసింహ, శిరసవాడ బిక్షం, కల్లెట్ల లింగయ్య సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గత సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలను అధికారులు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేయాలని కోరారు.గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు.
*50 పడకల ఆసుపత్రి పునరుద్ధరణకు తీర్మానం..
ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మర్రిగూడలో 50 పడకల ఆసుపత్రిని పునరుద్ధరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సమావేశంలో తీర్మానం చేయాలని ఎమ్మెల్సీ కోరారు. కూలీలకు ఉపాధి హామీ పనులు విస్తృతంగా కల్పించాలని, రోడ్ల నిర్మాణ సమయంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కాంట్రాక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనంతరం అధికారులు, సర్పంచులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను శాలువాతో సన్మానించారు. సమావేశానికి మండల ప్రత్యేక అధికారి బి. వేణుగోపాల్ అధ్యక్షత వహించగా ఎంపీడీవో జి.సి. మునయ్య, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.





























