- జలాలను రక్షిద్దాం భావితరాలకు అందిద్దాం: ఎంపీడీవో విశ్వప్రసాద్
ప్రతిపక్షం, వికారాబాద్, జూన్ 10: వన సంరక్షణతోనే మన సంరక్షణ ముడిపడి ఉందని ఎంపీడీవో విశ్వప్రసాద్ అన్నారు. బుధవారం ప్రజాపాల ప్రగతి ప్రణాళిక లో భాగంగా తాండూరు మండలం అంతారం గ్రామంలో రైతు వేదికలో ఏర్పాటుచేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు కార్యక్రమంలో వారు సర్పంచ్ జంగని లక్ష్మి, ఉప సర్పంచ్ రవి లతో కలిసి పాల్గొని మాట్లాడుతూ….. జల సంరక్షణ చేసి భావితరాలకు జల నిలువలను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల ముంగిలికి చేర్చడానికి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.స్థానిక స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని పరుగులు పెట్టించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా సేవలను అందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను స్వీకరించి, సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు. తడి పొడి చెత్తను వేరుచేసి గ్రామపంచాయతీ వాహనానికి అందించాలన్నారు. జల సంరక్షణ లక్ష్యంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వన సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లను నాటి సంరక్షించుకోవాలన్నారు. ఏఈఓ సుమ మాట్లాడుతూ రైతులు విధిగా రైతు నేస్తం కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ప్రతి రైతు తప్పకుండా రైతు నమోదు కార్డును తీసుకోవాలన్నారు. ఆధార్ లింక్ తప్పనిసరిగా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో యూరియా తదితర ప్రభుత్వం అందించే సబ్సిడీ వస్తువులను పొందే సమయంలో ఇబ్బంది కలవకుండా ఉంటుందన్నారు. వర్షాకాలంలో రైతులు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పంటలను సంరక్షించుకోగలుగుతారన్నారు. ఏఎస్ఐ శేఖర్ మాట్లాడుతూ… ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఏమి చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపై తప్పకుండా దృష్టి సారించాలన్నారు. ఇప్పటివరకు 360 కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. లైసెన్సు లేకుండా తమ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వద్దన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, నాయకులు మొగులప్ప, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.
















