మెదక్ లో నల్ల జెండాలతో సి. ఐ.టి.యూ నిరసన
ప్రతిపక్షం, ప్రతినిధి మెదక్, జూన్ 20: హైదరాబాద్ ఫైనాన్స్ జిల్లా పరిధిలోని నానక్ రామ్ గూడా అమెరికా కన్సల్టెన్సీ ఏరియాలోని రోడ్ కు ట్రంప్ పేరును వెంటనే తొలగించాలని సి. ఐ.టి.యూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర బి.జె.పి. ప్రభుత్వం మాదిరిగానే అమెరికాకు లొంగుబాటు వైఖరి నీ నిరసిస్తూ రాష్ట్ర వ్యాపిత పిలుపులో బాగంగా శనివారం నాడు సి. ఐ.టి.యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్ లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.అంతరం ఏ.మల్లేశం మాట్లాడుతూ సామ్రాజ్యవాద కాంక్ష కలిగిన అమెరికా ఒక వైపు భారత దేశం పై అనేక ఆంక్షలు పెడుతుందని విమర్శించారు. అమెరికా చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల పై క్రూరంగా వ్యవహరిస్తూ బేడీలు వేసి విమానం ఎక్కించి దేశానికి తిరిగి పంపి భారత దేశాన్ని తీవ్రంగా అవమానించిందని ఏ.మల్లేశం దుయ్యబట్టారు.ఇరాన్ పై ఇజ్రాయిల్ తో కలిసి యుద్ధం చేస్తున్న కారణంగా దేశం లో క్రూడ్ ఆయిల్,వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్,యూరియా ముడి సరుకుల ధరలు పెరిగి భారత ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్న విషయం గుర్తు చేశారు.మరో వైపు రష్యా వద్ద ఇంధనం కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వానికి అనుమతి ఇస్తామని కపట ప్రేమ ప్రకటించారు.రష్యా తో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండే భారత్ కు సత్సబంధాలు ఉండగా భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించే అమెరికా చర్యలను సి. ఐ.టి.యూ తీవ్రంగా ఖండిస్తున్నారు.భారత దేశాన్ని ఇన్ని రకాల ఇబ్బందులకు గురిచేస్తున్న అమెరికా దుచర్యలను నరేంద్ర మోడీ సర్కారు ఖండిచక పోను లొంగుబాటు వైఖరి తీసుకుంటుందని విమర్శించారు.అనేక విషయాల్లో యూనియన్ ప్రభుత్వం బాటలోనే నడుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ లో ఒక రోడ్ కు ట్రంప్ పేరు పెట్టడాన్ని చూస్తే వీరి నిజస్వరూపం బయట పడిందన్నారు.ప్రజలను దోచుకోవడంలో, దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం లో రెండు ప్రభుత్వాలది ఒకే దారి అనే విషయం తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా ఫైనాన్సియల్ జిల్లా పరిధిలో గల నానక్ రాంగూడ రోడ్ కు ట్రంప్ పేరు ను తొలగించి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సి. ఐ.టి. యూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి జె.సంతోష్ , అజయ్ తదితరులు పాల్గొన్నారు.


















