ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాల విలీనం.. ‘టీజీ సేఫ్’ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం

ప్రతిపక్షం, ఆగస్టు 04: తెలంగాణలో ఆహార భద్రత, ఔషధాల నియంత్రణ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలను విలీనం చేసి ‘తెలంగాణ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)’ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ నెలాఖరులోగా కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టీజీ సేఫ్‌కు ఉన్నతాధికారిగా సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించనున్నట్లు సమాచారం. అలాగే ఆహార, ఔషధాలకు సంబంధించిన ఉల్లంఘనలపై కేసుల నమోదు, దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.

ఈ విలీనంతో ఆహార పదార్థాలు, ఔషధాల తనిఖీలు, నాణ్యత నియంత్రణ, చట్ట అమలు వంటి అన్ని అంశాలు ఒకే వ్యవస్థ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తనిఖీలు మరింత పకడ్బందీగా సాగడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో సమర్థవంతమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Spread the love

Related News

Latest News