ప్రతిపక్షం, ఆగస్టు 06, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో భారీ నియామక ప్రక్రియకు సిద్ధమవుతోంది. మొత్తం 1,501 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభించిన కమిషన్, ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఈ నియామకాల్లో 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టులతో పాటు 108 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా, ఇతర పోటీ పరీక్షలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించేందుకు అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగనున్న పోలీస్ నియామక పరీక్షలు, నవంబర్‌లో జరగనున్న UPSC పరీక్షలు, అనంతరం పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు, అలాగే గ్రూప్స్, EAPCET తదితర ప్రధాన పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని పరీక్ష తేదీలను నిర్ణయించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పరీక్షల మధ్య తేదీల్లో ఘర్షణలు లేకుండా అభ్యర్థులకు అనుకూలంగా షెడ్యూల్ రూపొందించడంపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్షల తేదీలపై పూర్తి వివరాలను TGPSC ప్రకటించనుంది.
ఇటీవల వరుసగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ మరియు గణాంక విభాగాల్లో కీలక పోస్టులను భర్తీ చేయడం ద్వారా సేవలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

















