ముందస్తు వరి కోతలు షురూ.. సన్న ధాన్యానికి భారీ ధర

ప్రతిపక్షం, సెప్టెంబర్ 25: తెలంగాణలో సన్న బియ్యానికి డిమాండ్‌ పెరగడంతో సన్న రకం ధాన్యానికి కూడా భారీ గిరాకీ ఏర్పడింది. బియ్యం ధరలు ఇటీవల పెరుగుతుండటంతో సన్న బియ్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ మరింత పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఖరీఫ్‌ వరి కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే పలుచోట్ల వ్యాపారులు రైతుల పొలాల వద్దకే వెళ్లి పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సన్న రకాల ధాన్యానికి ప్రస్తుతం మంచి ధర లభిస్తోంది. బీపీటీ తదితర సన్న ధాన్యం క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.2,950 వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం. సాధారణంగా పంట కోత తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి విక్రయించే రైతులకు ఈసారి పొలాల వద్దే వ్యాపారులు ధరలు ప్రకటిస్తూ కొనుగోళ్లు చేపడుతున్నారు. దీంతో మార్కెట్‌లో సన్న ధాన్యానికి ఉన్న డిమాండ్‌ స్పష్టమవుతోందని రైతులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఖరీఫ్‌ వరి కోతలు కొన్ని ప్రాంతాల్లో ముందుగానే ప్రారంభమయ్యాయి. పంట చేతికి వస్తున్న సమయంలోనే వ్యాపారులు రైతులను సంప్రదిస్తూ పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అధికారిక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంలో తేమ శాతం 17 శాతానికి మించకూడదనే నిబంధన ఉంది.

అయితే ప్రైవేటు వ్యాపారులు మాత్రం 20 నుంచి 30 శాతం వరకు తేమ ఉన్న ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. రైతులు పంటను కోసిన వెంటనే విక్రయించేందుకు అవకాశం ఉండటంతో కొందరు రైతులు వ్యాపారులకే ధాన్యాన్ని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కోతలు, ఆరబెట్టడం, రవాణా వంటి ప్రక్రియలకు సమయం పట్టకుండా పొలాల వద్దే విక్రయాలు పూర్తవుతుండటం రైతులకు కొంత సౌలభ్యంగా మారింది.

పొలాల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని వ్యాపారులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ సన్న బియ్యానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ధాన్యాన్ని ముందుగానే సేకరిస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు సన్న ధాన్యానికి ఈ స్థాయిలో ధరలు లభించడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. పంట దిగుబడి, నాణ్యత, తేమ శాతం, మార్కెట్‌ డిమాండ్‌ ఆధారంగా ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఖరీఫ్‌ కోతలు మరింత ఊపందుకున్న తర్వాత మార్కెట్‌లోకి భారీగా ధాన్యం రావడంతో ధరలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం సన్న రకం ధాన్యానికి పెరిగిన డిమాండ్‌ కారణంగా పొలాల వద్దే ముందస్తు కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

Spread the love

Related News

Latest News