ప్రతిపక్షం, నవంబర్ 08: హైదరాబాద్‌లో గంజాయి అక్రమ విక్రయాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన నిత్తూబాయి అలియాస్ నీతూబాయిని ఈగల్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత రెండేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకుంటూ పరారీలో ఉన్న ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ధూల్‌పేట్‌కు చెందిన నిత్తూబాయి నగరంలో గంజాయి విక్రయాలకు ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి, నగరంలోని పలువురికి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని చిన్న చిన్న పరిమాణాల్లో గ్రాముల లెక్కన గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
గంజాయి విక్రయాల కోసం ఆమె కిరాణా దుకాణాన్ని ముసుగుగా ఉపయోగించుకున్నట్లు సమాచారం. సాధారణంగా కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు కనిపిస్తూనే మరోవైపు గంజాయి అక్రమ వ్యాపారాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. నగరంలో గంజాయి సరఫరా, విక్రయాలపై నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్ అధికారులు ఆమె కదలికలను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఆమెను పట్టుకోవడంతో గంజాయి అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, నిత్తూబాయిపై 2020 నుంచి 2026 వరకు మొత్తం 30 కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసుల్లో పలుమార్లు అరెస్టయి జైలుకు వెళ్లినప్పటికీ, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి వ్యాపారాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో నమోదైన కేసులు, ఆమెకు ఉన్న పరిచయాలు, గంజాయి సరఫరా చేసే వ్యక్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి ఎలా రవాణా అవుతోంది? హైదరాబాద్‌లో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు? ఈ అక్రమ వ్యాపారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో విచారణ కొనసాగనుంది. నిత్తూబాయి అరెస్టుతో నగరంలో గంజాయి విక్రయాలపై పోలీసుల నిఘా మరింత పెరిగే అవకాశం ఉంది.



























