దీర్ఘకాలంలో అధిక దిగుబడులిచ్చే పంటలపై దృష్టి పెట్టండి: రైతులకు సీఎం రేవంత్ సూచనలు

ప్రతిపక్షం, జూన్ 08: మృగశిర కార్తె ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్న రైతులు దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని రైతులకు సూచించారు. నీటి లభ్యత, నేల స్వభావానికి అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు.

ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల నేల సారం తగ్గిపోవడంతో పాటు తెగుళ్లు, చీడపీడల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని సీఎం వివరించారు. అందువల్ల పంట మార్పిడి విధానాన్ని పాటించడం ద్వారా నేల సారవంతత పెరిగి, దిగుబడులు మెరుగుపడతాయని చెప్పారు.

వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించి, నేల ఆరోగ్యాన్ని కాపాడే పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి పంటల వైవిధ్యీకరణ ఎంతో అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News