ప్రతిపక్షం, జూన్ 26: లంచం కేసులో అరెస్టైన శామీర్పేట్ తహశీల్దార్ సుచరితకు సంబంధించిన నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో ఆస్తులు, నగదు, బంగారం, వజ్రాభరణాలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
సోదాల్లో మొత్తం రూ.5.05 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. సుమారు రూ.1.20 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, రూ.12 లక్షల నగదు, రూ.38 లక్షల బ్యాంకు డిపాజిట్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు. అలాగే మూడు ఫ్లాట్లు, రెండు ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూమి, రెండు కార్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.
ఇటీవల రూ.30 లక్షల లంచం కేసులో సుచరితను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె న్యాయస్థానం ఆదేశాల మేరకు న్యాయ నిర్బంధంలో ఉన్నారు.
సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమాస్తుల కోణంలో దర్యాప్తును మరింత విస్తరించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
















