జ్ఞానేశ్ కుమార్ కొనసాగడంపై స్టాలిన్ అభ్యంతరం.. ఎస్ఐఆర్ నిలిపివేయాలని డిమాండ్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 24: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలో అంతర్గతంగా చోటుచేసుకున్న పరిణామాలపై ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావిస్తూ.. జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా కొనసాగడానికి హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిలిపివేసి, ఎన్నికల సంఘంలో జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ పేరుతో కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించే ప్రక్రియను డీఎంకేతో పాటు ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయని స్టాలిన్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రక్రియను చేపట్టడం వల్ల అనేక ప్రాంతాల్లో అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయని ఆయన ఆరోపించారు.

ఎన్నికల సంఘంలో ముగ్గురు సభ్యులు ఉండగా.. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తన పరిశోధనాత్మక కథనంలో పేర్కొంది. గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో వారు కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేసినట్లు ఆ కథనం వెల్లడించింది.

కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో ఎస్ఐఆర్‌కు సంబంధించిన అంశాలను చేర్చడంపైనా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది. ఈ మార్పు నిబంధనలకు అనుగుణంగా లేదని, కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే యువతకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని వారు పేర్కొన్నట్లు వెల్లడించింది. ఓటర్ల సమాచార వ్యవస్థను కేంద్రీకరించే చర్యలపైనా వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది.

ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ స్టాలిన్.. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు కలిగే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయడంతో పాటు, ఎన్నికల సంఘంలో జరిగిన పరిణామాలపై నిష్పాక్షికంగా, సమగ్రంగా విచారణ జరపాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

అయితే ఎన్నికల సంఘం మాత్రం ఈ ఆరోపణలకు భిన్నంగా స్పందించింది. గత ఏడాది కాలంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు పూర్తి కమిషన్ ఏకగ్రీవ నిర్ణయాలేనని స్పష్టం చేసింది. కమిషన్ సభ్యులు, అధికారులు తమ సూచనలు, అభిప్రాయాలను నమోదు చేయడం సాధారణ ప్రక్రియలో భాగమేనని పేర్కొంది. కొన్ని అంతర్గత అభ్యంతరాలను మాత్రమే ప్రస్తావించడం వల్ల మొత్తం నిర్ణయ ప్రక్రియలోని విస్తృత అంశాలు ప్రతిబింబించవని ఎన్నికల సంఘం తెలిపింది.

ఎస్ఐఆర్ విషయంలోనూ ఎన్నికల సంఘం తన చర్యలను సమర్థించుకుంటోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, ఓటర్ల పేర్ల తొలగింపు, ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్‌పై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి చర్చకు దారితీశాయి.

Spread the love

Related News

Latest News