బాస్మతి అవసరం లేదు.. మామూలు బియ్యంతోనే గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ

ప్రతిపక్షం, సెప్టెంబర్ 25: బిర్యానీ అంటే సాధారణంగా బాస్మతి బియ్యం గుర్తుకొస్తుంది. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ బియ్యంతోనూ ఎంతో రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. సరైన పద్ధతిలో బియ్యాన్ని ఉడికించి, మసాలా పొరలతో దమ్ చేస్తే అన్నం పొడిపొడిగా ఉండటంతో పాటు మంచి సువాసన, రుచి వస్తాయి. ఎక్కువగా ప్రత్యేక పదార్థాలు అవసరం లేకుండానే ఈ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.

ముందుగా ఆరు గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. సుమారు 350 నుంచి 400 గ్రాముల సాధారణ బియ్యాన్ని రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. సాధారణ బియ్యాన్ని ముందుగా నానబెట్టకుండా నేరుగా ఉడికించడం మంచిది. బియ్యం ఉడికేటప్పుడు బిర్యానీ ఆకు, బండపువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, స్టార్‌ అనైస్‌, పెద్ద యాలకులు, మరాఠి మొగ్గలు, మిరియాలు, షాజీరా, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా నెయ్యి, తగినంత ఉప్పు వేసుకోవాలి.

నీరు బాగా మరిగిన తర్వాత బియ్యాన్ని వేసి సుమారు 60 నుంచి 70 శాతం మాత్రమే ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడికిపోకుండా పలుకుగా ఉన్నప్పుడే నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. బియ్యం ఎక్కువగా ఉడికితే బిర్యానీ దమ్ చేసే సమయంలో మెత్తబడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ దశలో జాగ్రత్తగా ఉండాలి.

ఇప్పుడు బిర్యానీ మసాలా తయారు చేసుకోవాలి. పెద్ద గిన్నెలో మూడు టేబుల్‌స్పూన్ల నూనె, ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. వీటిలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకుంటే చివర్లో బిర్యానీపై చల్లుకోవచ్చు.

అదే నూనెలో కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా వేసి ఉడికించిన గుడ్లకు చిన్న చిన్న గాట్లు పెట్టి వేయించాలి. గుడ్లు మసాలా బాగా పట్టి కొద్దిగా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దమ్ సమయంలో గుడ్లలోకి మసాలా రుచి బాగా చేరుతుంది.

తర్వాత అదే గిన్నెలో అవసరమైతే కొద్దిగా నూనె వేసి జీలకర్ర, బిర్యానీ మసాలా దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అనంతరం తరిగిన టమాటాలు వేసి మూత పెట్టి రెండు, మూడు నిమిషాలు మగ్గించాలి.

టమాటాలు మెత్తబడిన తర్వాత పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి కలపాలి. దీనికి కొత్తిమీర, పుదీనా, ముందుగా వేయించిన ఉల్లిపాయలో సగం కలపాలి. మంటను తగ్గించి పెరుగు వేసి మసాలా అంతా బాగా కలిసేలా చేయాలి. ఆ తర్వాత వేయించిన గుడ్లను అందులో వేసి రెండు, మూడు నిమిషాలు ఉడికించాలి.

మసాలా సిద్ధమైన తర్వాత గుడ్లను సమంగా అమర్చి, వాటిపై కొద్దిగా కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయ చల్లాలి. అనంతరం ముందుగా 60 నుంచి 70 శాతం ఉడికించిన అన్నాన్ని పొరలుగా వేసి సమానంగా పరచాలి. అన్నంపై మిగిలిన కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయను చల్లాలి.

చివరగా రెండు టేబుల్‌స్పూన్ల వేడి నెయ్యిలో కొద్దిగా పసుపు కలిపి అన్నంపై చల్లాలి. దీనివల్ల బిర్యానీకి ఆకర్షణీయమైన రంగుతో పాటు మంచి సువాసన వస్తుంది. గిన్నెకు గట్టిగా మూత పెట్టి, తక్కువ మంటపై సుమారు 12 నుంచి 15 నిమిషాలు దమ్ చేయాలి. అవసరమైతే గిన్నె కింద మందపాటి పెనం పెట్టి దమ్ చేస్తే అడుగు భాగం కాలకుండా ఉంటుంది.

15 నిమిషాల తర్వాత మంట ఆపి కొద్దిసేపు అలాగే ఉంచి మూత తీస్తే గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ సిద్ధమవుతుంది. అన్నం పొడిపొడిగా, మసాలా రుచితో ఉండటంతో పాటు గుడ్లకు కూడా మసాలా బాగా పట్టి ఉంటుంది. రైతు బియ్యం, సాధారణ బియ్యం లేదా ఇంట్లో అందుబాటులో ఉన్న బియ్యంతోనే ఈ విధానాన్ని ప్రయత్నించవచ్చు. రుచికి తగ్గట్టుగా కారం, మసాలా పరిమాణాలను మార్చుకుని వేడి వేడిగా రాయితాతో కలిసి ఆస్వాదించొచ్చు.

Spread the love

Related News

Latest News