విద్యార్థుల హాజరులో ‘డుమ్మా’.. విద్యాశాఖ సీరియస్!

25 పాఠశాలల్లో పడిపోయిన హాజరు శాతం

ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీఈఓ ఆదేశం..

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, నవంబర్ 9: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని వందకు వందకు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోవడం విద్యాశాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యార్థుల హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ కొరడా ఝళిపించింది. సిద్ధిపేట జిల్లాలోని పలు మండలాలు, కాంప్లెక్స్‌ల పరిధిలో తక్కువ హాజరు నమోదైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులకు వివరణ కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్సీ నం. ఎఫ్ఆర్ఎస్/1/ఎ2/2026 తేదీ 09-11-2026 ద్వారా సంజాయిషీ నోటీసులు సోమవారం జారీ అయ్యాయి.

25 పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు శాతం

సిద్ధిపేట జిల్లాలో నవంబర్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నమోదైన విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించగా జిల్లాలోని 25 పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా తగ్గినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చేర్యాల మండలంలోని చేర్యాల ప్రాథమిక పాఠశాల(ఉర్దూ మాధ్యమం)లో అత్యల్పంగా 57.41 శాతం హాజరు నమోదైంది. సిద్ధిపేట అర్బన్ మండలంలోని దమ్మన్నగారి గూడెం ప్రాథమిక పాఠశాలలో 56.41 శాతం, రామచంద్ర నగర్‌ ప్రాథమిక పాఠశాలలో 58.33 శాతం హాజరు మాత్రమే నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. సిద్దిపేట పట్టణ పరిధిలోని పలు పాఠశాలలు, వర్గల్, హుస్నాబాద్, దుబ్బాక, దౌల్తాబాద్, కొమురవెల్లి, కోహెడ, గజ్వేల్, గజ్వేల్ పరిసర ప్రాంతాలు, అక్కన్నపేట, భూంపల్లి తదితర ప్రాంతాల్లోనూ తక్కువ హాజరు నమోదైన పాఠశాలలను అధికారులు గుర్తించారు.

హుస్నాబాద్‌లోనూ తగ్గిన హాజరు

హుస్నాబాద్ మండలంలో మొత్తం విద్యార్థుల హాజరు 79.89 శాతంగా నమోదైంది. హుస్నాబాద్‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78.27 శాతం, సిద్ధిపేట పట్టణంలోని నాసర్‌పురా ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఉర్దూ మాధ్యమం)లో 74.25 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ ప్రత్యేక హాజరు కార్యక్రమం కొనసాగుతున్న సమయంలోనూ ఈ పరిస్థితి నెలకొనడం అధికారుల దృష్టికి వెళ్లింది.

మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలి

తక్కువ హాజరుకు గల కారణాలు, తరచూ పాఠశాలకు గైర్హాజరు అవుతున్న విద్యార్థుల వివరాలు, వారి తల్లిదండ్రులను సంప్రదించి తీసుకున్న చర్యలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ వివరాలతో మూడు రోజుల్లోగా వ్యక్తిగత వివరణలు సమర్పించాలని డీఈఓ ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలల నుంచి వివరణలు సేకరించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలల వారీగా పర్యవేక్షణ నివేదికలు అందించాలని స్పష్టం చేశారు. ఎంఐఎస్ సమన్వయకర్తలు, సీఆర్పీలు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరును పరిశీలించడంతో పాటు తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు!

విద్యార్థుల హాజరు నమోదు చేయడంలో నిర్లక్ష్యం, తప్పుడు వివరాల నమోదు, సంతృప్తికరమైన వివరణ సమర్పించక పోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణిస్తామని డీఈఓ హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా వివరణలు ఇవ్వకపోయినా… హాజరు మెరుగుదలకు తగిన చర్యలు చేపట్టక పోయినా… అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుకు పునాది పాఠశాలే

ప్రతి విద్యార్థి బడికి వచ్చేలా చూడటం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారుల సమష్టి బాధ్యత. హాజరు పట్టికల్లో సంఖ్యలు పెంచడం కంటే తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడమే ప్రభుత్వ విద్యా లక్ష్యానికి నిజమైన కొలమానం కావాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

Related News

Latest News