కోర్టు ధిక్కరణ.. రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

ప్రతిపక్షం, నవంబర్ 09: కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు భావించిన న్యాయస్థానం ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం, వాటిని పట్టించుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించిన అంశాలను పరిశీలించిన న్యాయస్థానం, ధిక్కరణకు బాధ్యుడిగా కలెక్టర్‌ను పరిగణిస్తూ ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసింది. దీంతో ఈ వ్యవధిలో కలెక్టర్ అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టు ధిక్కరణ కేసులో జిల్లా స్థాయి ఉన్నతాధికారికి జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related News

Latest News