ప్రజల ప్రయాణ కష్టాలు పట్టించుకోని RTC అధికారులు!

హనుమకొండ బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు.. హైదరాబాద్‌కు బస్సుల కొరత

ప్రతిపక్షం, నవంబర్ 10: దీపావళి పండుగ ముగియడంతో సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే హనుమకొండ బస్టాండ్‌లో మాత్రం ప్రయాణికులకు సరైన రవాణా సౌకర్యాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌కు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాలకు వచ్చిన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు తిరిగి తమ పనులు, చదువుల నిమిత్తం హైదరాబాద్‌కు బయలుదేరుతుండటంతో బస్టాండ్‌లో రద్దీ పెరిగింది. కానీ ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లే, తిరిగి నగరాలకు చేరుకునే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంటుందన్న విషయం ఆర్టీసీ అధికారులకు ముందుగానే తెలిసినప్పటికీ తగిన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దీని అంచనా వేసి అదనపు బస్సులను నడిపించాల్సి ఉండగా, సాధారణ ప్రయాణికులకు అవసరమైన సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన వారు బస్సుల కోసం ఎదురుచూస్తూ సమయాన్ని కోల్పోతున్నారు. బస్సులు వచ్చిన వెంటనే ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఆర్టీసీ అధికారులు డీలక్స్, సూపర్ లగ్జరీ, ప్రత్యేక బస్సుల నిర్వహణపై దృష్టి సారిస్తున్నప్పటికీ సాధారణ ప్రయాణికుల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పండుగ సమయాల్లో అందరికీ అధిక చార్జీలతో కూడిన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉండకపోవచ్చని, సాధారణ బస్సుల సంఖ్యను కూడా రద్దీకి అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌–హనుమకొండ మార్గంలో అదనపు సాధారణ సర్వీసులు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

ప్రజా రవాణా వ్యవస్థ కేవలం ఆదాయం సమకూర్చే మార్గంగానే కాకుండా ప్రజల రోజువారీ ప్రయాణ అవసరాలను తీర్చే బాధ్యతను కూడా కలిగి ఉందని ప్రయాణికులు గుర్తుచేస్తున్నారు. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారు. హనుమకొండ బస్టాండ్‌లో ఏర్పడిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హైదరాబాద్‌కు అదనపు బస్సులు నడపాలని, సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Latest News