తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి.

*చండూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా.
*పంట రుణాలను రీ షెడ్యూల్ చేసి, వడ్డీ మాఫీ చేయాలి.
*వరి పంటకు రూ. 30 వేలు, పత్తి ,మిర్చి పంటలకు ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలి.
*సిపిఐ జిల్లా కార్యదర్శి , ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్
.

ప్రతి పక్షం చండూరు, నవంబర్ 10: ఎల్నినో కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. రైతాంగం, ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం చండూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు ఏర్పడి రైతులు వేసిన పంటలు కళ్లముందే ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో సాగునీరు మాత్రమే కాకుండా, కనీసం తాగునీరు కూడా దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని, వాటిపై ఉన్న వడ్డీని పూర్తిస్థాయిలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరువు తాకిడికి తీవ్రంగా నష్టపోయిన పత్తి, మిర్చి పంటలకు ఎకరానికి రూ. 50,000 చొప్పున మరియు వరికి రూ. 30,000 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు.

*ఉపాధి హామీ పని 200 రోజుల కు పెంచాలి :

నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా అధికారికంగా ప్రకటించాలని నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న గ్రామీణ పేదలను ఆదుకోవడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పని దినాలను 100 రోజుల నుండి 200 రోజులకు పెంచాలని కోరారు. సాగునీరు లేక ఎడారిగా మారుతున్న మునుగోడు నియోజకవర్గ దాహార్తిని, సాగు అవసరాలను తీర్చే దిండి ప్రాజెక్టును ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి, ప్రజలకు న్యాయం జరిగే వరకూ సిపిఐ తరఫున పోరాటాలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్, పార్టీ జిల్లా సమితి సభ్యులు తిప్పర్తి రాములు, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే మండల పార్టీ కార్యవర్గ సభ్యులు బరిగల వెంకటేష్, దోటి వెంకన్న, జెల్ల శ్రీను, బండమీది వెంకన్న, సి హెచ్ ఉషయ్య, గంట రమేష్, ఇరిగి సంజీవ, AIYF జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం నవీన్, కస్తాల సర్పంచ్ లేదన్న సత్యం, కురుపాటి పరమేష్, గంట నగేష్, పల్లె శంకరయ్య, శివర్ల లింగస్వామి, చీకటిమూడు యాదయ్య, జోగు రమేష్, జగన్, నరహరి, శ్రీశైలం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Latest News