–లక్ష్మణ్ గౌడ్ భార్యకు ఉద్యోగం కల్పిస్తాం.
–ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి భూమి సమస్యను పరిష్క రించాలి: ఎమ్మెల్యే పల్లా
–లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి.
ప్రతిపక్షం, బచ్చన్నపేట (కొమురవెల్లి), నవంబర్ 10: ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్త లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి వెళ్లిన ఇరువురు నాయకులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి పూలు చల్లి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి లక్ష్మణ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని, ఈ ఘటన తమ అందరినీ తీవ్రంగా కలచివేసిందని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తాను, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చామన్నారు. ముందుగానే కుటుంబాన్ని పరామర్శించేందుకు రావాలని భావించినప్పటికీ, పల్లా రాజేశ్వర్ రెడ్డికి కళ్ల కలక రావడంతో ఆలస్యమైందని, అయితే పల్లా మొదటి రోజే వచ్చి కుటుంబాన్ని పరామర్శించారని గుర్తుచేశారు. లక్ష్మణ్ గౌడ్ మృతికి దారితీసిన పరిస్థితులపై ఆయన భార్య స్వప్న, సోదరుడు వేణుతో మాట్లాడినట్లు హరీశ్ రావు తెలిపారు. కుటుంబ సభ్యులు వివరించిన అంశాలను ప్రజలకు తెలియ జేయాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. లక్ష్మణ్ గౌడ్ కొనుగోలు చేసిన జేసీబీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ కేసులో సీజ్ చేసి నెలల తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచారని కుటుంబ సభ్యులు తెలిపినట్లు వెల్లడించారు. భారీగా పెనాల్టీలు విధించడంతో జేసీబీని విడిపించుకోలేకపోయారని, దీంతో అప్పుల భారం పెరిగిపోయిందని వివరించారు.
లక్ష్మణ్ గౌడ్‌కు సొంతంగా ఉన్న ఏడు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వానాకాలం పంట సాగు చేసినట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు తపాస్‌పల్లి ద్వారా కొన్నే గ్రామ చెరువుకు నీరు రావాల్సి ఉన్నప్పటికీ ఈ ఏడాది నీరు రాలేదని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు బోరు కూడా విఫలం కావడంతో పంట ఎండిపోయిందని, పెట్టిన పెట్టుబడి నష్టపోయి మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు వివరించినట్లు చెప్పారు. దాదాపు 60 నుంచి 70 ఏళ్లుగా వారసత్వంగా అనుభవిస్తున్న భూమి తాత, తండ్రి, కుమారుల పేర్లపై ధరణి, రెవెన్యూ రికార్డుల్లో ఉన్నప్పటికీ, మరో వ్యక్తి ఆ భూమిపై హక్కు కోరుతూ దరఖాస్తు చేయడంతో కొత్త కలెక్టర్ ఆభూమిని ప్రొహిబిషన్ జాబితాలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు. భూమి ప్రొహిబిషన్ జాబితాలో ఉండటంతో అప్పులు తీర్చేందుకు దానిని విక్రయించే అవకాశం కూడా లేకుండా పోయిందని, ఈ పరిణామం లక్ష్మణ్ గౌడ్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని కుటుంబ సభ్యులు వివరించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ఆయన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సోదరుడికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. లక్ష్మణ్ గౌడ్ భార్యకు మంచి ఉద్యోగం ఇప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. లక్ష్మణ్ గౌడ్ మంచి క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త అని, ఆయనను కోల్పోవడం తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉందన్నారు.
ఒక వ్యక్తి మృతిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయంలో విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. జేసీబీ సీజ్ కావడం, పంటలకు నీరు, విద్యుత్ అందకపోవడం, భూమిని ప్రొహిబిషన్ జాబితాలో చేర్చడం వంటి పరిణామాల వల్లే లక్ష్మణ్ గౌడ్ కుటుంబం ఇబ్బందుల్లో పడిందని కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నానని అన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని కాపాడుకోవడంతో పాటు ఆయన ఆశయాలు కొనసాగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు. అనంతరం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, 2014 తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, జేసీబీ కొనుగోలు కారణంగా ఏర్పడిన అప్పులతో పాటు ఇతర ఆర్థిక పరిస్థితులపై కుటుంబ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు.
అప్పుల బాధతో పాటు తన భూమి తనకు కాకుండా పోతుందేమోనన్న ఆందోళన కూడా లక్ష్మణ్ గౌడ్‌ను తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటన ఎంతో బాధాకరమని అన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబం తమ కుటుంబమని, ఉద్యమకారుల కుటుంబమని, పార్టీ కుటుంబమని పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా కుటుంబానికి అండగా నిలిచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటన నేపథ్యంలో హరీశ్ రావు స్వయంగా వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్ధపడటం అభినందనీయమని, బీఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు అండగా నిలిచిన చరిత్ర తమ పార్టీకి ఉందని గుర్తుచేశారు. బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయం చేయకుండా ప్రస్తుతం తమను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తీరును తప్పుబట్టారు.
గతంలో ఎమ్మెల్యే పదవిని రాజశేఖర్ రెడ్డి కాళ్ల దగ్గర పెట్టిన వారు ఇప్పుడు తమను విమర్శించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఉద్యమకారుల పేరుతో రాజకీయం చేస్తూ విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. గతంలో పనిచేసిన కలెక్టర్ హయాంలో జేసీబీ అమ్మకం విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. బచ్చన్నపేట ప్రాంత ప్రజలకు విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూమి విషయంలో ప్రస్తుత కలెక్టర్ ప్రత్యేకంగా స్పందించాలని కోరారు. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తమదేనని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ బీఅర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




























