ప్రతిపక్షం, నవంబర్ 10: ఇప్పటికే కష్టాల్లో ఉన్న వ్యక్తులను మరింతగా దూషించడం, అవమానించడం ఏమాత్రం సమంజసం కాదని నటి రేణూ దేశాయ్ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాల్సింది పోయి, వారిని మరింత కుంగదీసేలా వ్యవహరించడం అమానుషమని పేర్కొన్నారు. ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వారూ మనుషులేనని, వారి పరిస్థితులను అర్థం చేసుకుని మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తన పోస్టులో రేణూ దేశాయ్ స్పందిస్తూ.. ఇప్పటికే కిందపడిపోయిన వారిని మళ్లీ తొక్కడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అతడిని మరింతగా విమర్శించడం లేదా అవమానించడం వల్ల సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. మనం కూడా తప్పులు చేసే మనుషులమేనని గుర్తుంచుకోవాలని, ఇతరుల పరిస్థితులపై తీర్పులు చెప్పే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలని సూచించారు. అద్దాల ఇంట్లో ఉంటూ ఇతరుల ఇళ్లపై రాళ్లు విసరకూడదనే సామెతను ప్రస్తావిస్తూ, ఎదుటివారిని విమర్శించే ముందు మన ప్రవర్తనను కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే తన వ్యాఖ్యలను ఏదో ఒక వ్యక్తికి లేదా ప్రత్యేక సంఘటనకు అన్వయిస్తూ ఊహాగానాలు చేయవద్దని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. తాను ఈ విషయాలు రాసినంత మాత్రాన ఎవరికో మద్దతు ఇస్తున్నానని, మరెవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నానని అనుకోవద్దని పేర్కొన్నారు. ఒక సమాజంగా మనమంతా మరింత మెరుగ్గా, బాధ్యతాయుతంగా మారాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇతరుల కష్టాలను చూసి ఆనందించడం లేదా వారిపై విమర్శలు గుప్పించడం కాకుండా, మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను సున్నితమైన మనసుతో స్పందిస్తున్నందుకు తనకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని, ఇందుకోసం ఎవరూ తనకు డబ్బులు చెల్లించడం లేదనే అర్థంలో ‘నేను సెన్సిబుల్‌గా ఉన్నందుకు పేటీఎంలో ఏమీ రాలేదు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తన స్పందన వెనుక ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం లేదని చమత్కారంగా చెప్పారు. రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.





























