ప్రతిపక్షం, నవంబర్ 10: తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 416 గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూయజమానులకు భూదార్ నంబర్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూముల సర్వేలో చిన్నపాటి పొరపాటు కూడా భవిష్యత్తులో వివాదాలకు దారితీయకూడదని, ప్రతి భూయజమానికి స్పష్టమైన హక్కులు, కచ్చితమైన భూహద్దులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో భూ రీసర్వే పురోగతిపై జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా సర్వే పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అధికారులు పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. భూముల విషయంలో తరతరాలుగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపేలా రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు.
తెలంగాణలో సమగ్ర భూ రీసర్వే ప్రక్రియ ఇప్పటికే వెయ్యికి పైగా గ్రామాల్లో ప్రారంభమైనట్లు మంత్రి గుర్తుచేశారు. ఇప్పటివరకు 416 గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. భూ యజమానుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. రీసర్వే ప్రక్రియను రెవెన్యూ రికార్డుల ఆధారంగా ప్రారంభించాలని, అందుబాటులో ఉన్న పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే భూముల కొలతలు, హద్దుల నిర్ధారణ చేపట్టాలని పేర్కొన్నారు. రికార్డుల్లోని వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న భూముల పరిస్థితి మధ్య తేడాలు ఉంటే వాటిని పరిశీలించి తగిన విధంగా పరిష్కరించాలని సూచించారు.
సర్వే పూర్తయిన తర్వాత భూయజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని పొంగులేటి ఆదేశించారు. తమ భూముల కొలతలు, సరిహద్దులు, రికార్డుల్లో నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు యజమానులకు తగిన అవకాశం కల్పించాలని తెలిపారు. సర్వేలో ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే వాటిని స్వీకరించి, నిబంధనల ప్రకారం పరిష్కరించిన తర్వాతే తదుపరి ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూయజమానులకు సమాచారం ఇవ్వకుండా లేదా వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని అధికారులకు సూచించారు.
రైతులకు భూ రీసర్వే విధానం, దాని ద్వారా కలిగే ప్రయోజనాలు, అభ్యంతరాలు నమోదు చేసుకునే విధానం, వాటి పరిష్కార ప్రక్రియపై అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. భూదార్ నంబర్ల కేటాయింపు పూర్తయితే ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడటంతో పాటు భూ రికార్డుల నిర్వహణ మరింత స్పష్టంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 2,720 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 125 ఏళ్ల తర్వాత తెలంగాణలో సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గేలా, భూయజమానులకు స్పష్టమైన హక్కులు కల్పించేలా అధికారులు పనిచేయాలని పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు.





























