ప్రతిపక్షం, బోథ్ ప్రతినిధి, మే 29: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆసుపత్రిని మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క సందర్శించారు. పలు వార్డుల్లో తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న గర్భిణులతో మాట్లాడారు. ఆసుపత్రిలో వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ, గిరిజనుల ఆరోగ్య సేవల కోసం ఏర్పాటు చేసిన వార్డును సందర్శించిన సుగుణక్క గిరిజనులకు ప్రత్యేకంగా అందిస్తున్న సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అర్థమై భాషలతో మాట్లాడి, ఆసుపత్రిలో చేరిన వారికి మనో ధైర్యం కల్పించి.. ప్రభుత్వ ఆసుపత్రిపై భరోసా కల్పించాలని కోరారు.
అనంతరం ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలోని గిరిజన ఆరోగ్య సేవల హెల్ప్ డెస్క్‌ను సందర్శించి కార్యాలయ సేవలను పరిశీలించి సిబ్బంది పనితీరును కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు మంచి వైద్యం అందజేయాలని, అనేక పథకాలు కొనసాగిస్తున్నట్లుగా తెలియజేసారు. వైద్య సేవలు, పథకాలు ప్రజలకు అందేలా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు.