ఉద్యోగులు కొత్త కోరికలు కోరడం లేదు

పెండింగ్‌ బకాయిలు, డీఏలు చెల్లించాలి

దసరా లోపు పీఆర్సీ ప్రకటించాలి

-జి.దేవీ ప్రసాద్, బివరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీఎన్జీవో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26: ఉద్యోగులు కొత్త కోరికలు కోరడం లేదని, తమకు రావలసిన బకాయిలు, హక్కులను మాత్రమే కోరుతున్నారని బెవరేజెస్ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, టీఎన్జీవో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. దేవీ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్‌, పదవీ విరమణ బకాయిలు, ఆరోగ్య కార్డులు తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండు డీఏలు మాత్రమే ఇస్తున్నట్లు చెబుతోందని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పీఆర్సీ గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని దసరా లోపు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలి

డిప్యూటీ సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలో చేసిన ప్రకటనలకు అనుగుణంగా చర్యలు ఎందుకు ముందుకు సాగడం లేదని దేవీ ప్రసాద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్వయంగా పీఆర్సీ నివేదికను తెప్పించుకోక పోతే ఉద్యోగులకు పీఆర్సీ రావడానికి మరో సంవత్సరం పట్టినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. పీఆర్సీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగిస్తే ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉద్యోగులు కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న హక్కులు, బకాయిలనే కోరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలు, మధ్యంతర భృతి తదితర అంశాలను ప్రస్తావించారు. ఉద్యోగులకు వేతన సవరణ విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం దిగిపోయే సమయానికి మూడు డీఏలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పీఆర్సీ జీవో ద్వారా మధ్యంతర భృతి కేసీఆర్ ఇచ్చారని పేర్కొన్నారు.

సీపీఎస్‌ రద్దు హామీ అమలు చేయాలి

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం(సీపీఎస్‌)ను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిందన్నారు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి

ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని దేవీ ప్రసాద్ విమర్శించారు. పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో జాప్యం వల్ల పెన్షనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రభుత్వ ఆదాయంలో సగం ఉద్యోగులకే ఖర్చవుతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తున్న మొత్తం సుమారు 38 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసినప్పుడు ప్రభుత్వం చెల్లించేది గ్రాట్యుటీ మాత్రమేనని తెలిపారు. ఉద్యోగులు తమ వేతనాల నుంచి పొదుపు చేసుకున్న మొత్తాలను తిరిగి పొందడంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. ప్రాన్‌ ఖాతాల్లో ఉన్న సుమారు రూ.10 వేల కోట్ల నిధుల పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆరోగ్య కార్డులపై స్పష్టమైన విధానం కావాలి

ఉద్యోగులు, పెన్షనర్లకు అందాల్సిన వైద్య సేవల విషయంలో సమస్యలు ఉన్నాయని దేవీ ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య కార్డులను కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. వెల్‌ నెస్‌ కేంద్రాలకు ఓపీ సేవలను అప్పగించినప్పటికీ, ప్రస్తుతం కేవలం నిమ్స్‌లోనే ఓపీ సేవలకు పరిమితం చేసిన పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

పెండింగ్‌ ప్రయోజనాలు విడుదల చేయాలి

ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, టీఏలు, సరెండర్‌ లీవులు తదితర ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దేవీ ప్రసాద్ కోరారు. ఉద్యోగులపై దుష్ప్రచారం చేయడం, వారిని చులకనగా చూడటం మానుకోవాలని కోరారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లను చర్చించి పరిష్కరించాలని ఆయన సూచించారు. ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థలో కీలక భాగమని, వారి సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గతంలో రైతు బంధుతో పాటు డీఏలు కూడా చెల్లిస్తామని కేసీఆర్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారని పేర్కొన్నారు. అయితే ఆ ప్రక్రియకు కాంగ్రెస్‌ నాయకులు అడ్డు పడ్డారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా పీఆర్సీ గడువును పొడిగిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దసరా లోపు పీఆర్సీ ప్రకటించడంతో పాటు పెండింగ్‌ డీఏలు, ఉద్యోగులు–పెన్షనర్ల బకాయిలు, సీపీఎస్‌, ఆరోగ్య కార్డులు తదితర సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్టీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు భుజంగరావు, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News