*అనర్హులకు పెన్షన్లు ఇస్తే కఠిన చర్యలు.
*అన్ని గ్రామాల్లో తక్షణమే ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి.
*బడి మానేసిన 800 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలి.
*కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు దిశా నిర్దేశం.
*నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
ప్రతి పక్షం నల్గొండ, నవంబర్ 10 : జిల్లాలో ఈనెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు మండలాల వారీగా చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి జిల్లా, మండల స్థాయి అధికారులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీలో స్థానిక ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. వారి సమ్మతితోనే పంపిణీ తేదీలను ఖరారు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనర్హులకు పెన్షన్లు ఇవ్వరాదని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఏదైనా దరఖాస్తు తిరస్కరణకు గురైతే, అందుకు గల సరైన కారణాలను గ్రామ పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు.
*ఉపాధి పనులు తక్షణమే ప్రారంభించాలి:
వి.బి.జి. రామ్ జీ (VBG Ramji) కింద జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో పనులు తక్షణమే ప్రారంభం కావాలని, పనులు ప్రారంభించని గ్రామం అంటూ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. లేబర్ టర్న్ అవుట్ (కూలీల సంఖ్య) పెంచాలని, మంజూరైన పనులన్నీ గ్రౌండ్ కావాలన్నారు. ఫీడర్ ఛానల్ లలో పిచ్చి మొక్కల తొలగింపు, పూడికతీత పనులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు వెంటనే ప్రణాళికలు రూపొందించి వారంలోగా ఎంపీడీవోలకు పంపాలని ఆదేశించారు. మ్యాజిక్ సోక్ పిట్లు, కమ్యూనిటీ సోక్ పిట్లు, బోర్ వెల్ రీఛార్జ్, రూఫ్ టాప్, డ్రైనేజీ సోక్ పిట్ల నిర్మాణాలను అన్ని గ్రామాల్లో చేపట్టాలని, ముందుగా మోడల్ గ్రామాల్లో శాచ్యురేషన్ పద్ధతిలో వీటిని పూర్తి చేయాలన్నారు.
*పశువులకు తాగునీరు, గ్రాసం కొరత ఉండొద్దు:
ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో పశువులకు, మేకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లదేనని కలెక్టర్ తెలిపారు. నీటి వసతి ఉన్న చోట పశుగ్రాసం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పశువుల తాగునీటి తొట్లకు మరమ్మతులు ఉంటే ఎంపీడీవోలు వెంటనే పూర్తి చేయాలని, నీటి తొట్లు లేని చోట ఈ నెలాఖరులోగా కొత్త వాటిని నిర్మించాలని ఆదేశించారు.
*పాఠశాలల్లో టాయిలెట్లు, డ్రాపౌట్లపై ప్రత్యేక దృష్టి:
జిల్లాలో ఇంకా టాయిలెట్ సౌకర్యం లేని 20 పాఠశాలలను గుర్తించామని, ఆయా పాఠశాలల్లో వెంటనే పనులు ప్రారంభించి వచ్చే వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే, జిల్లా వ్యాప్తంగా బడి మధ్యలో మానేసిన (డ్రాపౌట్స్) 800 మంది విద్యార్థులను గుర్తించామన్నారు. తహసిల్దార్, ఎంఈఓ, అంగన్వాడీ వర్కర్లు సమన్వయంతో సదరు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, కౌన్సిలింగ్ ఇచ్చి వారిని తిరిగి పాఠశాల బాట పట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్చార్జ్) ప్రేమ్ కరణ్ రెడ్డి, డి.ఆర్.డి.ఓ శేఖర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సుశీందర్ రావు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.





























