ప్రతిపక్షం, నవంబర్ 11: తెలంగాణలో ప్రభుత్వం మారింది.. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి అందుబాటులోకి వచ్చింది. కానీ భూములకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్న రైతులకు మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఉపశమనం లభించడం లేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో భూ వివాదాలు, రెవెన్యూ రికార్డుల చిక్కులు, నిషేధిత ఆస్తుల జాబితా, పెండింగ్ దరఖాస్తులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ధరణి పోర్టల్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పిన రైతులు, ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, పోర్టళ్ల పేర్లు మారుతున్నా భూముల సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా రిజిస్ట్రేషన్ యాక్ట్‌లోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిన భూములు రైతులకు పెద్ద సమస్యగా మారాయి. గతంలో అనుమతులు పొందిన లేఅవుట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఎన్వోసీలు) ఉన్న స్థలాలు సైతం నిషేధిత జాబితాలోకి చేరడంతో వాటి యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములు తమ పేరుపై ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేసుకోలేకపోవడం, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోవడం, అవసరాలకు అనుగుణంగా క్రయవిక్రయాలు జరపలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనుకునే వారు కూడా భూములపై స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం కొనసాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ దరఖాస్తులు కూడా రైతులకు భారంగా మారుతున్నాయి. భూభారతి ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వాటిపై నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా 8జీకి సంబంధించిన వివాదాలు, భూ రికార్డుల సవరణలు, పట్టాదారు హక్కుల నిర్ధారణ వంటి అంశాల్లో స్పష్టత లేకపోవడంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సమస్యల పరిష్కారం కోసం పారదర్శకమైన విధానం ఉండాలని, దరఖాస్తుల ప్రస్తుత స్థితి ఏమిటో రైతులకు తెలియజేయాలని బాధితులు కోరుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినప్పుడే కొన్ని సమస్యలు కదులుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక యాచారం, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్ ప్రాంతాల్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన రిజిస్ట్రేషన్ వివాదాలు రెవెన్యూ యంత్రాంగం పనితీరుపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తమకు తెలియకుండానే కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయని అధికారులు ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సంబంధిత విభాగాల లాగిన్లు, భూముల రికార్డుల పరిశీలన, అనుమతులు వంటి అంశాలు అధికారిక వ్యవస్థ ద్వారానే నిర్వహించబడతాయి. అలాంటప్పుడు సంబంధిత అధికారులకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారాల్లో అసలు ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు బయటపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అంశాలపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి అధికారిక విచారణ ద్వారా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, నాలా కన్వర్షన్, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ వంటి అంశాలు కూడా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కందుకూరు మండలంలో సుమారు 20 ఏళ్ల క్రితమే ప్లాట్లుగా మారిన భూములకు ఇప్పుడు ఏ ప్రాతిపదికన కొత్తగా హక్కులు కల్పిస్తున్నారు? గతంలో అనుమతులు పొందిన భూములు తిరిగి వివాదాల్లోకి ఎలా వెళ్తున్నాయి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. భూముల హక్కుల విషయంలో ఒకే విధమైన విధానం అమలు చేయాలని, పాత రికార్డులు, అనుమతులు, సంబంధిత పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇక ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించిన పరిణామం కూడా జిల్లా రెవెన్యూ పాలనపై చర్చకు దారితీసింది. భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో న్యాయస్థానాల ఆదేశాలను అమలు చేయడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశం చేసింది. మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో భూముల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, భూముల యజమానులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి మారాలని కోరుతున్నారు. కేవలం పోర్టల్ పేర్లు మార్చడం కాకుండా భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం, పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడం, నిషేధిత జాబితాలోని అర్హమైన భూములపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా రైతుల భూములకు భరోసా కలగకపోతే భూ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రైతుల్లో ప్రధానంగా వినిపిస్తోంది.



























