డబ్బులకు ఆశపడకుండా ఓటేయండి.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

ప్రతిపక్షం, నవంబర్ 11: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రాడ్యుయేట్లు డబ్బులకు ఆశపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు ద్వారా ఇచ్చే తీర్పుతోనే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడం సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ ఆశించిన మార్పు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానిని సరైన విధంగా వినియోగించుకోవాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు.

బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే, వారిలో దాదాపు 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని తెలిపారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో పట్టభద్రులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు 10 లక్షల మంది కూడా ఓటర్లుగా నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వెంటనే గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు కోసం నమోదు చేసుకోకపోతే ఎన్నికల సమయంలో తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం కోల్పోతారని అన్నారు. యువత, విద్యావంతులు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటుతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని కవిత అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే ప్రజలు ఎన్నికల్లో చైతన్యవంతమైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. యువత తమ ఓటును డబ్బులకు అమ్ముకోవద్దని, ప్రలోభాలకు లొంగకుండా అభ్యర్థుల ఆలోచనలు, విధానాలు, ప్రజా సమస్యలపై వారి వైఖరిని పరిశీలించి ఓటు వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా రాజకీయ నేపథ్యం లేని యువ ఎంపీల సంఖ్య తక్కువగా ఉందని ప్రస్తావిస్తూ, కొత్త తరానికి రాజకీయాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.200 కోట్లు ఖర్చు చేసి గెలవాలని చూస్తోందని కవిత ఆరోపించారు. యువ ఓటర్లు డబ్బులకు ఆశపడకుండా తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. మొత్తం 77 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుధవారం నుంచే అధికారికంగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులకు వీర తిలకం దిద్ది ఎన్నికల బరిలోకి దింపుతున్నామని పేర్కొన్నారు.

ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతామని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేనకు ఎన్నికల సంఘం నుంచి అధికారిక గుర్తింపు ఉందని తెలిపారు. పార్టీ గుర్తింపునకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ, వాటికి సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు, నిరుద్యోగులు, యువత తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఓటర్ల నమోదు నుంచి ఎన్నికల ప్రచారం వరకు పట్టభద్రులను చైతన్యపరిచేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని కవిత వెల్లడించారు.

Related News

Latest News