దశాబ్దం గడిచినా దక్కని పెన్షన్ భరోసా..

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు ఎప్పుడు?

ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు.. తెలంగాణలో తాత్సారం!

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 11: నోటిఫికేషన్ ముందే.. నియామకాలు మాత్రం ఆలస్యంగా జరిగాయనే కారణంతో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం ఎంతవరకు సమంజసమని నంగునూరు మండల 2003 డీఎస్సీ పాత పెన్షన్ సాధన సమితి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2015లోనే వివరాలు సేకరించిన ప్రభుత్వం దశాబ్దం గడుస్తున్నా సమస్యను పరిష్కరించక పోవడంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రంలో పాత పెన్షన్ అమలవుతుంటే తెలంగాణలో ఎందుకీ వివక్ష అంటూ నిలదీశారు. తక్షణమే స్పందించి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సమితి అధ్యక్షుడు సింగిరెడ్డి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనుముల వీరేశం డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న ఈ న్యాయమైన సమస్యను ప్రభుత్వం ఇకనైనా పరిష్కరించి వారికి సామాజిక భద్రత కల్పించాలని కోరారు.బుధవారం నంగునూరులో నిర్వహించిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాత పెన్షన్ సాధన కోసం ఉపాధ్యాయులు సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన తేదీని ప్రామాణికంగా తీసుకొని పాత పెన్షన్ వర్తింపజేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

2015లోనే వివరాల సేకరణ.. పరిష్కారం ఏదీ?

2003 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ 2004 సెప్టెంబరు 1వ తేదీ కంటే ముందే విడుదలైందని చెప్పారు. వివిధ కారణాల వల్ల నియామక ప్రక్రియ అనంతరం ఉపాధ్యాయులు విధుల్లో చేరాల్సి వచ్చిందని వివరించారు. నోటిఫికేషన్ ముందుగా విడుదలైనప్పటికీ, నియామకాలు ఆలస్యమయ్యాయనే కారణంతో కొత్త పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్) పరిధిలోకి తీసుకురావడం ఉపాధ్యాయులకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి 2015 నవంబరు 24న మెమో నంబర్ 6996 ద్వారా సంబంధిత ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వం సేకరించిందని గుర్తుచేశారు. అయితే వివరాల సేకరణ జరిగి దాదాపు దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సమస్యపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోక పోవడం ఉపాధ్యాయులను నిరాశకు గురి చేస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అమలు.. తెలంగాణలో నిర్లక్ష్యం ఎందుకు?

పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 158 ద్వారా 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ వెలువడిన ఉద్యోగ నియామకాల విషయంలో సంబంధిత ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేసే నిర్ణయం తీసుకుందని వారు ప్రస్తావించారు. అదే తరహాలో నోటిఫికేషన్ ద్వారా ఎంపికై తెలంగాణలో విధుల్లో చేరిన ఉపాధ్యాయుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఒకే కాలంలో నోటిఫికేషన్ వెలువడిన నియామక ప్రక్రియకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉండటం ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఇక్కడి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

పెన్షన్ భద్రత ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కు

ఉపాధ్యాయులు తమ జీవితంలో విలువైన సంవత్సరాలను విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి అంకితం చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రశాంతమైన జీవనం సాగించేందుకు పెన్షన్ ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానం అనేది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదని చెప్పారు. దీర్ఘకాలం ప్రభుత్వ సేవలందించిన ఉద్యోగులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించే సామాజిక భద్రతా వ్యవస్థ అని వివరించారు.
సుదీర్ఘకాలంగా ప్రభుత్వ విద్యారంగానికి సేవలందిస్తున్న 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను ఇకపై జాప్యం చేయకుండా సంబంధిత శాఖలతో సమీక్షించాలని కోరారు. 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన అర్హులైన ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం వర్తింపజేసేలా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని సింగిరెడ్డి రమణా రెడ్డి, అనుమల వీరేశం డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.
ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు గడీల శ్రీకాంత్, జైపాల్ యాదవ్, కొత్తపల్లి రవి, రామకృష్ణ, రాములు, మహమ్మద్ ఆశ్రఫ్, నిమ్మ భాస్కర్ రెడ్డి, మట్ట శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశం, ప్రణీత తదితరులు పాల్గొన్నారు

Related News

Latest News