ఆజాద్ వల్ల ఎంతో మంది ఇంజినీర్లు అయ్యారు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, నవంబర్ 11: దేశ విద్యావ్యవస్థ బలోపేతానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో విద్యా రంగం అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచాయని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుతో ఉన్నత విద్యకు అవకాశాలు పెరిగాయని, ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణల ఫలితంగా ఎంతోమంది ఇంజినీర్లుగా ఎదిగేందుకు మార్గం సుగమమైందని కొనియాడారు.

హైదరాబాద్‌లోని బంజారాభవన్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యాసంస్థల స్థాపనతో పాటు సాంకేతిక విద్యకు ప్రోత్సాహం అందించడంలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించేలా ఆజాద్ కృషి చేశారని అన్నారు.

ఆజాద్ హయాంలో ప్రవేశపెట్టిన పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐ) ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునికీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణలో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడం ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

Latest News