గుజరాత్‌లో మైనార్టీ రిజర్వేషన్లు ఎందుకు తొలగించడం లేదు?: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, నవంబర్ 11: మైనార్టీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రిజర్వేషన్ల వల్ల మైనార్టీ వర్గాలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన జాతీయ విద్యా, మైనార్టీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మైనార్టీల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

సచార్ కమిటీ చేసిన సూచనల ఆధారంగా మైనార్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నిర్ణయం ద్వారా విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడంతో పాటు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మైనార్టీ యువతకు వెసులుబాటు కలిగిందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మైనార్టీలకు కల్పిస్తున్న 4 శాతం రిజర్వేషన్లను తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని సీఎం విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా మైనార్టీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని ప్రస్తావిస్తూ, అక్కడ వాటిని ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. గుజరాత్‌లో కొనసాగుతున్న రిజర్వేషన్ల విషయంలో ఒక విధంగా, తెలంగాణలో మరో విధంగా బీజేపీ నేతలు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. తెలంగాణలో మైనార్టీల రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రకటనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రస్తావిస్తూ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో మైనార్టీలు, ఎస్టీలు, ఆదివాసీలు, పేదల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మైనార్టీలను ఓటు హక్కుకు కూడా దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు ఉండాలని, ఎలాంటి వివక్ష లేకుండా ఓటర్ల జాబితాలో వారి పేర్లు కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ ఏర్పాటు చేసిన వివిధ సంక్షేమ పథకాల స్టాళ్లను పరిశీలించారు.

Related News

Latest News