ఫోన్లు కాదు పుస్తక పఠనం నేర్పించాలి
ర్యాంకులు మార్కులే కాదు..బాధ్యతలు నేర్పించాలి.
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
మహిళా ఉపాధ్యాయుల బాధ్యత చాల గొప్పది
మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో గళమెత్తుతా
కార్పొరేట్ వ్యాపారులతో చిన్న వ్యాపారస్తులకు ఇబ్బందులు
తన్నీరు హరీశ్ రావు, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే.
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, సెప్టెంబర్ 27: ర్యాంకులు, మార్కులే కాకుండా విద్యార్థులకు సమాజం పట్ల మంచి బాధ్యతలు నేర్పించాలని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్ లో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (టిపిఎస్ఏ) ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అని హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత దగా డీఎస్సీ చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం 16 వేల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ను జాబ్ లెస్ క్యాలెండర్ గా మార్చారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో గళమెత్తుతానని స్పష్టం చేశారు. కార్పొరేట్ స్థాయి విద్యాలయాలు, వ్యాపారస్తులతో చిన్న స్థాయి వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కార్పొరేట్ విద్యాలయాలు రావడంతో ప్రైవేట్ స్కూల్స్ వారు భయాందోళన చెందుతున్నారని అన్నారు. ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితి కష్టంగా మారిందన్నారు. ఉపాధ్యాయుల బాధ్యత సమాజంలో ఎంతో కీలకమన్నారు. ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నవారు కూడా ఉపాధ్యాయులు నేర్పిన విద్యాబుద్ధులతోనే ఈ స్థాయిలో నిలుస్తారని అన్నారు.
మంచి సమాజ నిర్మాణం గురువులతోనే సాధ్యమవుతుందన్నారు. దేశానికి మంచి పౌరులను అందించేది ఉపాధ్యాయులేనని చెప్పారు. ఉపాధ్యాయులను గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. మహిళా ఉపాధ్యాయుల బాధ్యత చాలా గొప్పదని చెప్పారు. ఒకవైపు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు విద్యార్థులను సొంత పిల్లల చూసుకుంటూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లు వాడకం తగ్గించి పుస్తక పఠనం చేస్తే మంచి జీవిత పాఠాలు నేర్చుకుంటారని తెలిపారు. విద్యార్థులకు పుస్తక పఠనం వల్ల సమాజం గురించి తెలుస్తుందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు చిన్నప్పటినుండి తెలియజేయాలన్నారు. ఒత్తిడికి గురి కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, నాయకులు రాజనర్సు, సాయిరాం, టీపీఎస్సీ అధ్యక్షులు భగవాన్ రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు రజనీకాంత రెడ్డి, రమేశ్, సంపత్ కుమార్, సంతోష్, హనుమంత రెడ్డి, సురేందర్ రెడ్డి, సంతు, లింగం, శ్రీనివాస్ తదితరులున్నారు.
































