ఓటు హక్కుపై అవగాహన… ప్రజాస్వామ్యానికి పునాది
ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కు అత్యంత కీలకం
-తగిరెడ్డి దేశిరెడ్డి, మండల విద్యాధికారి
నంగునూరులో మండల స్థాయి వ్యాసరచన, ప్రశ్నోత్తర పోటీలు
ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు11: ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటు హక్కు అత్యంత కీలకమని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి చెప్పారు. ప్రతి పౌరుడు ఓటు విలువను గుర్తించాలన్నారు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విద్యార్థుల్లో ఓటరు చైతన్యం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించే లక్ష్యంతో బుధవారం నంగునూరు మండల స్థాయిలో ఓటరు అక్షరాస్యత సంఘాల ఆధ్వర్యంలో వ్యాసరచన, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించారు. సిద్దిపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక ఈ పోటీలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి, అంక్షాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగార్జునరెడ్డి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక సిద్దిపేట జిల్లా ఆర్థిక కార్యదర్శి వై.రాంగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని చెప్పారు. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాకుండా సమాజం పట్ల ప్రతి పౌరుడికి ఉన్న బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. అంక్షాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సామాజిక బాధ్యతలను కూడా అలవర్చుకోవాలని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక జిల్లా ఆర్థిక కార్యదర్శి వై. రాం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓటరు అక్షరాస్యత సంఘాల ద్వారా విద్యార్థులకు ఎన్నికల వ్యవస్థపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని, విషయ పరిజ్ఞానాన్ని, వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్యంపై గౌరవాన్ని పెంచుతాయని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు.
పాఠశాలల విభాగంలో విజేతలు:
ప్రశ్నోత్తర పోటీల్లో నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. రిష్వంత్ రెడ్డి (పదో తరగతి), అక్కెనపల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన ఎ. సచిత్ కుమార్ ప్రతిభ కనబరిచారు.వ్యాసరచన పోటీల్లో నర్మెట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పి. రిష్వంత్, అక్కెనపల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన బి.శ్రీజని ప్రతిభ చాటుకున్నారు.
కళాశాలల విభాగంలో విజేతలు:
ప్రశ్నోత్తర పోటీల్లో అక్కెనపల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన పి. అలేఖ్య, బి. కృష్ణవేణి ప్రతిభ కనబరిచారు.
వ్యాసరచన పోటీల్లో నంగునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన వి. నిహారిక, అక్కెనపల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన కె. రాహిత్య ప్రతిభ చాటుకున్నారు.ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ముఖ్య అతిథులు అభినందించారు. విద్యార్థుల్లో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.






























