ప్రతిపక్షం, ఆగస్టు 09: హైదరాబాద్‌లో బోనాల సందడి కొనసాగుతోంది. ఆదివారం భాగ్యనగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఇళ్లలో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసుకుంటున్నారు. బోనాల సందర్భంగా మేక మాంసంతో పల్లెటూరి స్టైల్‌లో యాటకూర వండుకోవాలనుకునేవారికి ఈ రెసిపీ ఎంతో ఉపయోగపడుతుంది.
యాటకూర తయారీకి మేక మాంసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, పసుపు, కారం, ఉప్పు, నూనె, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, అనాసపువ్వు, పుదీనా, కొత్తిమీర వంటి పదార్థాలు సిద్ధం చేసుకోవాలి.
ముందుగా మేక మాంసాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి బిర్యానీ ఆకు, షాజీరా, అనాసపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించాలి. అనంతరం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి.
ఇప్పుడు మాంసం ముక్కలు వేసి మసాలాతో బాగా కలిసేలా సుమారు 15 నుంచి 20 నిమిషాలు వేయించాలి. వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి కలిపి, అవసరమైనంత నీరు పోసి మాంసం మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. మాంసం బాగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేసి కలపాలి.
తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. గ్రేవీ చిక్కగా వచ్చే వరకు మరికొంతసేపు ఉడికించాలి. చివరగా పుదీనా, కొత్తిమీర వేసి ఒకటి రెండు నిమిషాలు ఉడికించి పొయ్యి మీద నుంచి దించేయాలి.
అంతే.. పల్లెటూరి స్టైల్‌లో ఘుమఘుమలాడే యాటకూర సిద్ధం. బోనాల పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక వంటకాన్ని ఆస్వాదించవచ్చు.






























