ఆయిల్ పామ్ పంటలతో రైతులకు స్థిరమైన అధిక ఆదాయం

నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ తెలంగాణకు మణిహారం

రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరణే లక్ష్యం

తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి

నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రి తుమ్మల

ప్రతిపక్షం, నంగునూరు, సెప్టెంబర్‌ 26: తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును మరింత విస్తరించి, రైతులకు స్థిరమైన అధిక ఆదాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్‌ పామ్ ఫ్యాక్టరీని శనివారం జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి మంత్రి సందర్శించారు. ఫ్యాక్టరీ పనితీరు, గెలల ప్రాసెసింగ్, నీటి లభ్యత, రిఫైనరీ నిర్మాణ పనులు, పర్యావరణ పరిరక్షణ చర్యలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాను చేసిన తొలి సంతకం నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించినదేనని తెలిపారు. అధికారుల సమన్వయం, కృషి కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యాయని పేర్కొన్నారు.

70 వేల మెట్రిక్‌ టన్నుల గెలల ప్రాసెసింగ్‌

నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో మార్చి నెల నుంచి ఇప్పటివరకు సుమారు 70 వేల మెట్రిక్‌ టన్నుల ఆయిల్‌పామ్ గెలలను ప్రాసెస్‌ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీలో నూనె వెలికితీత నిష్పత్తి (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో-ఓఈ ఆర్) అధికంగా రావడం వల్ల రైతులకు మరింత మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించిన సమయంలో ఆయిల్‌పామ్ గెలల ధర టన్నుకు సుమారు రూ.12 వేలుగా ఉండగా, ప్రస్తుతం రూ.24 వేల వరకు పెరిగిందని వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర, ప్రాసెసింగ్‌ సౌకర్యాలు అందుబాటులో ఉండటం ద్వారా ఆయిల్‌పామ్ సాగు మరింత ఆకర్షణీయంగా మారుతుందన్నారు.

తెలంగాణకు నర్మెట్ట ఫ్యాక్టరీ మణిహారం

దేశంలోనే అత్యాధునిక యంత్ర సామగ్రితో నిర్మించిన నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న నర్మెట్ట ఫ్యాక్టరీ అన్ని జిల్లాల ఆయిల్‌పామ్ రైతులకు సేవలు అందించేందుకు అనుకూలమైన ప్రాంతంలో ఉందన్నారు. ఖమ్మం జిల్లా రాష్ట్రంలోని ఒక మూలన ఉండటంతో అక్కడి ఫ్యాక్టరీలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతులకు సమర్థవంతంగా సేవలందించడం సాధ్యం కావడం లేదని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రాంతాల వారీగా ప్రాసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

పది వేల ఎకరాలకు ఒక ఫ్యాక్టరీ లక్ష్యం

రాష్ట్రంలో కనీసం 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 11 ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలు నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు.రిలయన్స్ సంస్థ తెలంగాణలో రిఫైనరీతో కూడిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో దేశంలో సగానికి పైగా ఆయిల్‌ పామ్ సాగు

దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్ సాగవుతోందన్నారు. దీనిలో సగానికి పైగా సాగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 40 సంవత్సరాల క్రితమే ఆయిల్‌పామ్ సాగు ప్రారంభమైందని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 6 లక్షల ఎకరాల్లో సాగవుతోందన్నారు.తెలంగాణలో గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఆయిల్‌ పామ్ సాగు వేగంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని తెలిపారు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించాలన్నది తన ఆకాంక్ష అని మంత్రి వెల్లడించారు.

నర్మెట్టలో వచ్చే ఏడాది రిఫైనరీ పూర్తి

నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం రిఫైనరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది నాటికి రిఫైనరీ పనులు పూర్తిచేసి, ఫ్యాక్టరీలోనే ఆయిల్‌ను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీనివల్ల ముడి పదార్థం నుంచి తుది ఉత్పత్తి వరకు విలువ జోడింపు ప్రక్రియ రాష్ట్రంలోనే జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

వ్యర్థాల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి

ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్‌ అనంతరం మిగిలే గెలల పిప్పి వంటి వ్యర్థాలను కూడా సమర్థవంతంగా వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. వాటి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఫ్యాక్టరీ అవసరాలకు వినియోగిస్తున్నామని చెప్పారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి ఫ్యాక్టరీ అవసరాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల రైతులకు, వ్యవసాయ భూములకు ఎలాంటి నష్టం కలగకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

తపాస్ పల్లి రిజర్వాయర్‌ నుంచి నీటి సరఫరా

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఫ్యాక్టరీలో నీటి సమస్య తలెత్తిందని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితిని గుర్తించిన జిల్లా కలెక్టర్ కె.హైమావతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తపాసు పల్లి రిజర్వాయర్‌ నుంచి నీటిని అందుబాటులోకి తీసుకు వచ్చారని చెప్పారు. ఫ్యాక్టరీకి సరఫరా చేయించారని పేర్కొన్నారు.ఫ్యాక్టరీ కార్యకలాపాలకు అవసరమైన నీటిని సమకూర్చడంలో ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

విదేశీ మారక ద్రవ్య ఆదాయం పెంచే అవకాశం

దేశంలో సుమారు 70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరించినట్లయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలపై ఆధారపడటం తగ్గి, దేశానికి గణనీయమైన విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆయిల్‌ పామ్ రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా 44 శాతం దిగుమతి సుంకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.

రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు రావాలి

ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకుని, రైతులకు నిలకడైన, అధిక ఆదాయాన్ని ఆయిల్ పామ్ అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సాపేక్షంగా స్థిరమైన, అధిక ఆదాయం అందించే ఆయిల్‌ పామ్ తోటల సాగు వైపు రైతులు అధిక సంఖ్యలో ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణతో పాటు ఫ్యాక్టరీలు, రిఫైనరీలు, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందితే రైతులకు మార్కెట్‌ సౌకర్యాలు మెరుగవుతాయని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఆర్డీవో సదానందం, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్ యాదవ్, వైస్ ఛైర్మన్ సాదుల పవన్ కుమార్ ప్రజాప్రతినిధులు, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News