సమయం విలువైనది.. వృథా చేయకండి

ఆరు నెలలు కష్టపడండి ఉద్యోగం సాధించండి

హరీశన్నా ఉద్యోగం వచ్చింది మీరు నా దగ్గరికి వచ్చి అన్నప్పుడే ఈ శిక్షణకు సార్దకత.

ఉద్యోగం వచ్చేదాకా స్మార్ట్ ఫోన్లను, సోషల్ మీడియాను పక్కన పెట్టాలి.

కష్టపడితేనే ఫలితం.. ఉచితం అనగానే నిర్లక్ష్యం చేయొద్దు

కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, సెప్టెంబర్ 27: “సమయం బంగారం కంటే విలువైనది. సమయం వృధా చేయకండి. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టుదలతో చదివి పోలీస్ కొలువు సాధించండి” అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ శిబిరాన్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్ధిపేటలో ఆదివారం ప్రారంభించారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగావకాశాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆయన సొంత ఖర్చులతో సిద్ధిపేటలో ఈ “కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్”ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ ఇప్పిస్తున్నారు. సుమారు 370 మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తో పాటు మధ్యాహ్న భోజన వసతిని ఆయన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం, అభ్యర్థుల్లో స్ఫూర్తి నింపుతూ హరీశ్ రావు కీలక మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మీకు నవంబర్ 29వ తేదీ వరకు కేవలం ఉద్యోగం మాత్రమే కనిపించాలి. అర్జునుడికి పక్షి కన్ను ఎలా కనిపించిందో మీ లక్ష్యం మీకు అలా స్పష్టంగా ఉండాలి..దీన్ని ‘ఉచిత కోచింగ్’ అని పిలవడం మానేయండి. ఉచితం అనగానే నిర్లక్ష్యం వస్తుంది, సీరియస్ నెస్ పోతుంది. పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని మీరు కట్టాల్సిన ఫీజును నేనే కడుతున్నాను. కాబట్టి డబ్బులు కట్టి చదువుతున్నామనే పట్టుదలతో ఉండండి. తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి పేరు మీద ఈ సెంటర్ పెట్టాను. కేసీఆర్ అంటేనే పట్టుదలకు మారుపేరు. ఆ పట్టుదలతోనే ఎవరూ రాదన్న తెలంగాణను సాధించారు. ఆయన స్ఫూర్తితోనే మీరు పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి.

నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా..

“నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్ధిపేటకు నీళ్లు వచ్చాయి. నిధులతో సిద్దిపేట జిల్లాగా మారి, మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాంటివి వచ్చాయి. కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారు. గతంలో 60 శాతం స్థానికులకు, 40శాతం స్థానికేతరులకు కేటాయించే విధానం ఉండేది. దీంతో ఆంధ్రా వాళ్లు ఇక్కడి ఉద్యోగాలు పొందేవారు. కేసీఆర్ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అందుకే ఈరోజు ఇంత మంది ఆడబిడ్డలు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. 370 మందిని సెలెక్ట్ చేస్తే అందులో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి చదువుతో పాటు దేహదారుఢ్యం అవసరం. అలాగే మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఇందులో సమాజానికి రక్షణగా నిలబడే సామాజిక బాధ్యత ఉంటుంది”.

సమయ పాలన పాటించండి

“కోచింగ్ తీసుకునే అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకల్లా క్లాసులో ఉండాలి. సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. ఏ ఒక్క క్లాస్ మిస్సయినా నష్టపోతారు. ఈ ఆరు నెలలు మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయండి. ఫేస్‌ బుక్, ఇన్‌స్టా గ్రామ్, యూట్యూబ్, రీల్స్ చేస్తామంటే ఇక్కడికి రాకండి. ఆరు నెలలు కష్టపడితే మీ జీవితం బాగుపడుతుంది, మీ తల్లిదండ్రులు తలెత్తుకుని తిరుగుతారు.”

పేదరికం అడ్డంకి కాదు..పట్టుదల ముఖ్యం

“గతంలో కాటన్ మార్కెట్ యార్డులో కోచింగ్ ఇచ్చినప్పుడు 700 మంది కోచింగ్ తీసుకున్నారు. ఒక ముస్లిం అమ్మాయి వాళ్ల నాన్న సిద్దిపేటలో తోపుడు బండి మీద ఉల్లిగడ్డలు అమ్ముతాడు. ఆ అమ్మాయి పట్టుదలతో చదివి ఉద్యోగం పొందింది. రైతు బజార్లో కూరగాయలు అమ్ముకునే ఒక తల్లి కూతురు, ఏడ్చుకుంటూ వచ్చారు. తనకు ఉద్యోగం కావాలని పట్టుదలతో చదివింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఇప్పుడు సిద్ధిపేట జిల్లాలోనే పని చేస్తోంది. పేదరికం అడ్డు కాదు, పట్టుదల ముఖ్యం. హైదరాబాద్ వెళ్లి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఫీజులు, రూమ్ కిరాయిలు కట్టలేని పేద విద్యార్థుల కోసం హైదరాబాద్ ఫ్యాకల్టీనే సిద్దిపేటకు తీసుకొచ్చి శిక్షణ ఇప్పిస్తున్నాం.”

క్యాంపు ఆఫీసులో ఉచిత మధ్యాహ్న భోజనం

దుబ్బాక, గజ్వేల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు ఇలా దూరం నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఇబ్బంది కావద్దని.. నా క్యాంప్ ఆఫీసులోనే మీ అందరికీ భోజన వసతి కల్పిస్తున్నాను. మీరంతా నా పిల్లలే.కేసీఆర్ పదేళ్ల పాలనలో 19 వేలు, 12 వేలు, 10 వేలు ఇలా మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి 40 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశాం.

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది

“కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. నేను అసెంబ్లీలో నిలదీస్తే 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని ఒప్పుకున్నారు. పోలీసు శాఖలో 25 వేల కానిస్టేబుల్ ఖాళీలు ఉంటే కేవలం 7 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. నిరుద్యోగులు దిల్ షుఖ్ నగర్ లో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తే కానీ ఆ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఖాళీలు లేక కాదు, ఇద్దామన్న మనసు లేకనే మోసం చేశారు. ఈ కోచింగ్ కేవలం కానిస్టేబుల్ పోస్టులకే కాదు, జాతీయ స్థాయిలో వచ్చే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర ఉద్యోగాలకు కూడా ఎంతో ఉపయోగ పడుతుంది. నవంబర్ 29వ తేదీన మీకు తొలి పరీక్ష ఉంది. ఆ రోజు ‘దీక్షా దివస్’. కేసీఆర్ గారు దీక్షకు కూర్చుని తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజే, మీ జీవితాన్ని కూడా మలుపు తిప్పాలి. ఆ తర్వాత డిసెంబర్ 28న మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి నా సొంత ఖర్చులతో హైస్కూల్ గ్రౌండ్ లో పీఈటీల ద్వారా ఫిజికల్ టెస్ట్ కోచింగ్ ఇప్పిస్తాను. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ కి కూడా నేనే ఉచిత శిక్షణ ఇప్పిస్తాను”.

ప్రతి రోజూ డైలీ టెస్ట్…వారానికి గ్రాండ్ టెస్ట్

“క్లాసులో చెప్పింది ఎప్పటికప్పుడు చదువుకోవాలి. ఇందు కోసం ప్రతిరోజూ డైలీ టెస్ట్ పెడతాం. వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం. అటెండెన్స్ కచ్చితంగా ఉండాలి. చిన్నచిన్న కారణాలతో శిక్షణకు డుమ్మా కొడితే వారిని శిక్షణ నుంచి తొలగించి పట్టుదలతో ఉన్న వేరే అభ్యర్థులకు అవకాశం ఇస్తాం. గత 13 ఏళ్లుగా నేను ఇప్పిస్తున్న కోచింగ్ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, టెట్ సహా ఎంతో మంది పేద పిల్లలు ఉద్యోగాలు సాధించి, నా దగ్గరకు స్వీట్ బాక్స్ తీసుకొని రావడం నాకు అత్యంత సంతృప్తినిచ్చే విషయం. మీరంతా కూడా రేపు అలా ఉద్యోగాలు సాధించి రావాలి” అని ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News