సెప్టెంబర్ 30లోపు ఉచిత నమోదుకు అవకాశం
తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీలు
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను భాగస్వాములను చేయాలి
రాదారి నాగరాజు, డీఆర్పీ
ప్రతిపక్షం, నంగునూరు, సెప్టెంబర్ 27: విద్యార్థుల్లో భారతీయ నాగరికత, సాంస్కృతిక వారసత్వం, రాజ్యాంగపరమైన బాధ్యతలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, జాతి నిర్మాణంలో భాగస్వామ్యం వంటి వాటిపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్టీ), న్యూఢిల్లీ, రామకృష్ణ మఠం–బేలూరు శాఖకు చెందిన అద్వైత ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ‘జాగో యువ–జాగో భారత్’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన డీఆర్పీ రాదారి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, నాగరికత, రాజ్యాంగ బాధ్యతలు, సాంస్కృతిక వారసత్వం, నైతిక నాయకత్వం, దేశ నిర్మాణంలో యువత పాత్ర వంటి అంశాలపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలు నిర్వహిస్తారని చెప్పారు.
ఐదు విభాగాల్లో పోటీలు
నమోదు చేసుకున్న పాఠశాలలు, కళాశాలలకు ‘స్వామి వివేకానంద – జాతికి అతని పిలుపు’, ‘స్వామి వివేకానంద సంక్షిప్త జీవిత చరిత్ర’ అనే రెండు పుస్తకాలను పీడీఎఫ్ రూపంలో అందజేస్తారని తెలిపారు.వాటిని అధ్యయనం చేసిన విద్యార్థులకు రీల్స్ లేదా లఘు వీడియోలు, చిత్ర లేఖనం, వ్యాస రచన, వక్తృత్వం, నాటక ప్రదర్శన తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
పాఠశాల నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యా సంస్థలను అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాలని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులను పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో డిజిటల్ సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు. విద్యార్థుల వ్యక్తిగత ఈమెయిల్ చిరునామాలకు లేదా సంబంధిత విద్యాసంస్థల ఈమెయిల్‌కు సర్టిఫికెట్లు పంపనున్నట్లు వివరించారు.
సెప్టెంబర్ 30లోపు ఉచిత నమోదు
పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారిక వెబ్సైట్: https://www.jyjb.in లో నమోదు చేసుకోవాలని తెలిపారు. నేరుగా నమోదు చేసుకునే లింక్:https://www.jyjb.in/register ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.
పోటీల నిర్వహణకు కాలపట్టిక
పాఠశాల స్థాయి పోటీలను నవంబర్ 15 వ తేదీ లోపు, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలను డిసెంబర్ 2026లోపు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో విజేతలకు 2027 జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బహుమతులు, సర్టిఫికెట్లు అందిస్తారని తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తి, సంస్కృతి, విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను జాతీయ స్థాయిలో చాటుకోవాలని పిలుపునిచ్చారు.





























