భూసర్వేతో ప్రభుత్వ భూముల పరిరక్షణ
- నంగునూరు తహశీల్దార్ ప్రవీణ్ రెడ్డి
ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 11: గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి భూసర్వే ఎంతో ఉపయోగ పడుతుందని నంగునూరు మండల తహశీల్దార్ ప్రవీణ్ రెడ్డి అన్నారు. భూముల హద్దుల విషయంలో రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని పరిరక్షించేందుకు భూ సర్వే దోహదం చేస్తుందని పేర్కొన్నారు.మైసంపల్లి గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ సోమిరెడ్డి నరేశ్ రెడ్డి అధ్యక్షతన రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తహశీల్దార్ ప్రవీణ్ రెడ్డి, ఉప తహసీల్దార్, సహాయ సంచాలకులు, సర్వేయర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ హాజరయ్యారు. గ్రామ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సోమిరెడ్డి నరేశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూసర్వే కార్యక్రమాన్ని మైసంపల్లి గ్రామంలో నిర్వహించడం సంతోషకరమన్నారు.
ఈ సర్వే ద్వారా గ్రామంలోని భూ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.ముఖ్యంగా భూముల హద్దులు, టిప్పన్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శివారు గ్రామాల సరిహద్దులను స్పష్టంగా గుర్తించేందుకు భూసర్వే ఉపయోగపడుతుందన్నారు. గ్రామ పరిధిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని పరిరక్షించుకోవడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. గ్రామసభలో రైతులు, గ్రామ ప్రజలు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వారి సందేహాలు, ప్రశ్నలకు రెవెన్యూ అధికారులు సమాధానాలు ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి గ్రామ ప్రజలు, రైతులు అధికారులకు సహకరించాలని కోరారు.






























