బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కోల శ్రీకాంత్ గౌడ్

కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

– అందె శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్, బీజేపీ కార్మిక విభాగం:

ప్రతిపక్షం, నంగునూరు, నవంబర్ 11: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగంలో పారిశ్రామిక కార్మికుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన కోల శ్రీకాంత్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్ అధికారిక నియామక పత్రాన్ని జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకిత భావం, సమర్థవంతమైన సేవలను గుర్తించి ఈ నియామకం చేపట్టినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. కార్మిక విభాగంలో పారిశ్రామిక కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు, కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం పనిచేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన కోల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, వేతనాలు, ఉద్యోగ భద్రత, పని ప్రదేశాల్లో సౌకర్యాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. వారి సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కార్మిక విభాగం కీలక పాత్ర పోషిస్తానన్నారు.ఈ నియామక ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అందె శ్రీనివాస్ వెల్లడించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పదాధికారులు, కార్యకర్తలు నూతనంగా నియమితులైన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడికి పూర్తి సహకారం, మద్దతు అందించాలని ఆయన కోరారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, వారి హక్కుల సాధన కోసం అంకితభావంతో పనిచేసి పార్టీ కార్మిక విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

Related News

Latest News