ప్రతిపక్షం, నవంబర్ 11: రైతులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 రబీ సీజన్లో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువుల కోసం రూ.62,370 కోట్ల సబ్సిడీ అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులపై అదనపు భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముఖ్యంగా డీఏపీ ఎరువుల ధర విషయంలో రైతులకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. 50 కిలోల డీఏపీ బస్తా ధర గతంలో మాదిరిగానే రూ.1,350గా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకు, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెరిగిందని కేంద్ర మంత్రి వివరించారు. ఈ పరిణామాలు ఎరువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. రైతులు సాగు సమయంలో అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయించిందన్నారు. రబీ పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
కేంద్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయంగా సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించే ముద్ర యోజనకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఈ పథకం 2031 మార్చి వరకు కొనసాగనుంది. పీఎం ముద్ర యోజన ప్రారంభమైనప్పటి నుంచి 2026 సెప్టెంబర్ వరకు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు 60.36 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేశాయని, వాటి మొత్తం విలువ రూ.43.34 లక్షల కోట్లుగా ఉందని కేంద్రం వెల్లడించింది. రుణాలు తిరిగి చెల్లించడంలో తలెత్తే ప్రమాదాల నుంచి రుణ సంస్థలకు రక్షణ కల్పించే క్రెడిట్ గ్యారెంటీ వ్యవస్థ ఈ పథకంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం కోసం రూ.5,000 కోట్ల నిధులు కేటాయించేందుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ద్వారా భవిష్యత్తులో రూ.12.6 లక్షల కోట్ల విలువైన ముద్ర రుణాలకు మద్దతు లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే స్టాండప్ ఇండియా పథకాన్ని కూడా మరో ఐదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం గడువును 2031 మార్చి 31 వరకు పొడిగించింది. రానున్న ఐదేళ్లలో అదనంగా 2.5 లక్షల మంది వ్యాపారవేత్తలకు ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2016 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 2.75 లక్షల మందికి పైగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రుణాలు పొందినట్లు వివరించారు.
ఈ పథకం కింద కొత్తగా గ్రీన్ఫీల్డ్ సంస్థలను ఏర్పాటు చేయాలనుకునే అర్హులైన మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు అందిస్తారు. ఉత్పాదక, సేవా, వాణిజ్య రంగాలతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ రుణాలు ఉపయోగపడతాయి. ప్రతి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు శాఖ నుంచి కనీసం ఒక ఎస్సీ లేదా ఎస్టీ లబ్ధిదారుడికి, కనీసం ఒక మహిళా పారిశ్రామికవేత్తకు రుణం అందించాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. రుణాల చెల్లింపునకు గరిష్ఠంగా 18 నెలల మారటోరియం వెసులుబాటు ఉండగా, మొత్తం రుణాన్ని ఏడేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఇవే కాకుండా ఢిల్లీలోని చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను మ్యూజియంగా మార్చే యుగే యుగీన్ మ్యూజియం అభివృద్ధికి రూ.3,230 కోట్లు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నోయిడా సెక్టార్ 51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్ 4 వరకు కొత్త మెట్రో రైలు మార్గం నిర్మాణానికి రూ.2,390 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుకు కూడా పచ్చజెండా ఊపింది. ఇలా రైతులకు ఎరువుల సబ్సిడీ, చిన్న వ్యాపారాలకు రుణ భరోసా, మహిళలు మరియు వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం, పట్టణ రవాణా సదుపాయాల విస్తరణ వంటి పలు అంశాలపై కేంద్ర మంత్రివర్గం ఒకే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.





























