విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యం

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

–ఎనగందుల మనీష్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు

నర్మెట్ట ప్రాథమిక పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 11: విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి, సామాజిక చైతన్యం సాధ్యం అవుతాయని నర్మెట్ట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎనగందుల మనీష్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాలన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నంగునూరు మండలం నర్మెట్ట ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యారంగ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను చేరువ చేయడంతోపాటు, విద్య ద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన విశేషంగా కృషి చేశారని తెలిపారు. విద్య అనేది కొందరికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

సౌదీ అరేబియాలోని మక్కాలో 1888 నవంబర్ 11వ తేదీన జన్మించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనంతరం భారతదేశానికి వచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. మహాత్మా గాంధీతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం సాగించారని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం జైలు జీవితాన్ని అనుభవించారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి విద్యారంగ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని వివరించారు.ఆయన జయంతిని నవంబర్ 11వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత విశేషాలను, స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన పోరాటాన్ని, విద్యారంగానికి అందించిన సేవలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తహసీన్ సుల్తానా, ఎం.డి. హర్షద్, సునీత, లలిత, కవిత తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News