•వారి కులవృత్తికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేస్తా*
•కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి ప్రతినిధి, నవంబర్ 12, ప్రతిపక్షం: కుమ్మరి సామాజికవర్గ అభివృద్ధికి, వారి సంప్రదాయ కులవృత్తి పరిరక్షణకు తాను అహర్నిశలు కృషి చేస్తానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హామీ ఇచ్చారు.బుధవారం వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని వనపర్తిలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. రామాయణాన్ని సరళమైన, సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో రచించి, తన సాహిత్యం ద్వారా సమాజానికి విలువైన సందేశాన్ని అందించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ అని కొనియాడారు.ఆమె సేవలు, సాహిత్య కీర్తి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
కుమ్మరుల కులవృత్తికి చేయూత.. ప్రత్యేక స్థలం ఏర్పాటు కుమ్మరి సోదరుల జీవనోపాధికి ఆధారమైన సంప్రదాయ కులవృత్తిని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. వారు తమ వృత్తిని స్వేచ్ఛగా కొనసాగించుకునేందుకు వనపర్తిలో ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానన్నారు.కుండలు, ఇతర మట్టి వస్తువుల తయారీకి అవసరమైన మట్టిని తరలించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు, అడ్డంకులు ఎదురుకాకుండా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయిస్తానని హామీ ఇచ్చారు.కేవలం హామీలకే పరిమితం కాకుండా కుమ్మరి సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కుమ్మరి సోదరులందరికీ ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, మహనీయుల చరిత్రను భావితరాలకు పరిచయం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు.

























