కూకట్‌పల్లిలో విషాదం.. మందు పార్టీ కాస్తా ప్రాణం తీసింది!

స్నేహితులతో కలిసి ఫుల్లుగా తాగిన యువకుడు.. తెల్లారేసరికి విగతజీవి

కేపీహెచ్‌బీలో అర్ధరాత్రి ఏం జరిగింది?

కుకట్‌పల్లి, ప్రతిపక్షం, సెప్టెంబర్ 27: మద్యం మత్తు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితులతో కలిసి రాత్రంతా మద్యం తాగిన ఓ యువకుడు తెల్లవారేసరికి శవమై కనిపించిన ఘటన కేపీహెచ్‌బీ సర్దార్ పటేల్ నగర్ లో తీవ్ర కలకలం రేపింది.మృతుడు కాకుమాని రామకృష్ణ, 29 ఏళ్లు, ప్రకాశం జిల్లా వాసి.ప్రస్తుతం కేపీహెచ్‌బీలోని బజాజ్ షోరూమ్ పైన గల గదిలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు.

ఏడుగురితో మందు పార్టీ..

26వ తేదీ రాత్రి 8 గంటలకు రామకృష్ణ తన గది స్నేహితులు సాదిక్, అరవింద్, సంతోష్, రఫీలతో కలిసి మద్యం తీసుకొచ్చాడు. హాల్ లోనే పార్టీ మొదలైంది. ఆ తర్వాత మరో ఇద్దరు సూరజ్, వెంకటేష్ కూడా వచ్చి కలిశారు. మొత్తం ఏడుగురు కలిసి రాత్రి 11 గంటల దాకా తాగుతూనే ఉన్నారు.11 గంటలకు సూరజ్, వెంకటేష్ వెళ్లిపోయినా మిగిలిన ఐదుగురు మాత్రం తాగడం ఆపలేదు. రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో రామకృష్ణ వాంతి కూడా చేసుకున్నాడట. అయినా స్నేహితులు పట్టించుకోలేదు. మళ్లీ తాగడం కొనసాగించారు.ఆ తర్వాత అందరూ భోజనం చేసి హాల్ లోనే పడుకున్నారు. కానీ రామకృష్ణ మాత్రం తినకుండానే అలాగే నిద్రలోకి జారుకున్నాడు.

తెల్లవారుజామున షాక్..

రాత్రి 2 గంటల సమయంలో సంతోష్ మరుగుదొడ్డికి వెళ్తుండగా హాల్ లో కుర్చీల మధ్య దారిలో రామకృష్ణ పడి ఉండటం చూశాడు. మొదట దారికి అడ్డంగా పడుకున్నాడనుకున్నాడు. పక్కకు జరగమని పిలిచినా పలకలేదు. దగ్గరికి వెళ్లి చూసేసరికి ఒళ్ళంతా చల్లబడిపోయి ఉంది. కదలికే లేదు.వెంటనే మిగిలిన వాళ్ళను లేపి ఆటోలో నిజాంపేట్ రోడ్డులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి నాడి లేదని, తెల్లవారుజామున 4:30 గంటలకు చనిపోయాడని చెప్పారు.

అన్న ఫిర్యాదుతో కేసు నమోదు..

విషయం తెలియగానే హైదరాబాద్ ఈసీఐఎల్ లో మృదుపరికర ఉద్యోగిగా పనిచేస్తున్న అన్న అజయ్ కుమార్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడు. తన తమ్ముడి చావులో అనుమానాలు ఉన్నాయని, అసలు కారణం ఏంటో తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీకి తరలించారు. అతిగా తాగడం వల్లే చనిపోయాడా? లేక మద్యంలో ఏమైనా కల్తీ జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గదిలో ఉన్న స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మద్యం మహమ్మారి మరో ప్రాణం తీసింది.. యువత ఇప్పటికైనా మేల్కోవాలని స్థానికులు అంటున్నారు.

Spread the love

Related News

Latest News