- దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు
- ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో యువతలో చైతన్యం
- తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్
ప్రతిపక్షం, కరీంనగర్, సెప్టెంబర్ 28: దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన విప్లవ వీరుడు షహీద్ భగత్‌సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని సోమవారం కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ పేరు వినగానే దేశభక్తి, త్యాగం, ధైర్యం, విప్లవ స్ఫూర్తి గుర్తుకొస్తాయని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన యవ్వనాన్ని, జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. చిన్న వయసులోనే దేశ పరిస్థితులపై లోతుగా ఆలోచించి బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారని తెలిపారు.
భగత్‌సింగ్ పోరాటం కేవలం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మాత్రమే కాదని, అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా కూడా సాగిందని హరిప్రసాద్ అన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు, గౌరవం లభించే సమాజాన్ని నిర్మించాలన్నది ఆయన ఆకాంక్ష అని పేర్కొన్నారు. జైలు జీవితం, కఠిన శిక్షలు, ప్రాణహాని వంటి వాటికి ఏమాత్రం భయపడకుండా తన ఆశయ సాధన కోసం ముందుకు సాగారని తెలిపారు.‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా మార్మోగిస్తూ యువతలో విప్లవ స్ఫూర్తిని నింపిన ఘనత భగత్‌సింగ్‌కు దక్కుతుందని అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించినా తన సిద్ధాంతాల నుంచి వెనక్కి తగ్గకుండా చివరి క్షణం వరకు ధైర్యంగా నిలిచారని గుర్తుచేశారు. దేశం కోసం నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడిన ఆయన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.నేటి యువత భగత్‌సింగ్ జీవితాన్ని కేవలం పుస్తకాల్లో చదివి మరిచిపోకుండా ఆయనలోని దేశభక్తి, ప్రశ్నించే తత్వం, సామాజిక చైతన్యం, త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని హరిప్రసాద్ సూచించారు.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తూ ప్రజల కోసం నిలబడే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు.
స్వాతంత్ర్యం సాధించడం కోసం భగత్‌సింగ్ వంటి ఎందరో వీరులు తమ జీవితాలను త్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భగత్‌సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని హరిప్రసాద్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా సీనియర్ నాయకులు మ్యాకల తిరుపతి, చంటి శ్రీనివాస్, గర్షకుర్తి విద్యాసాగర్, బండారి అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.





























