బల్దియాపై పోరు ఉద్యమంలో ఎమ్మెల్యే ధన్ పాల్ ఫైర్
ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్ సెప్టెంబర్ 28: అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిజామాబాద్ కార్పొరేషన్ మారిందని, ప్రతి బడ్జెట్ మీటింగ్ లో కోట్లు కేటాయిస్తారు కానీ పనుల కోసం రూపాయి ఖర్చు చేయడం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ కార్పొరేటర్లు సోమవారం నగరంలోని ధర్నా చౌక్లో బీజేపీ పోరు ఉద్యమం చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యే గా ఉండి కూడా ధర్నా చేస్తున్నానంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కార్పొరేషన్లు రూ.150 కోట్ల ఆదాయం, రూ.94 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నా ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటున్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలించినా మేయర్ కాంగ్రెస్ పార్టీ యే ఉన్నా అభివృద్ధి చేయలేకపోయింది ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అభివృధ్ధి కొరకు రూ.200 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పటివరకు విడుదల చేయలేరన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడి మేయర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. నిజామాబాద్ ప్రజలకు నిధులు కాగితాలపై కనిపించడం అవసరం లేదు. ఆ నిధులతో చేసిన రోడ్డు కనిపించాలి, నిర్మించిన డ్రైనేజీలు కనిపించాలి, వెలిగే దీపాలు కనిపించాలన్నారు. కమిషనర్ కు అనేకసార్లు కలిసి లేఖలు అందించినా స్పందించకపోవడం తగదన్నారు. బడ్జెట్ లో డివిజన్ల అభివృద్ధి కొరకు 35 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ఒక్క డివిజన్ కు కూడా రూపాయి కేటాయించలేదన్నారు.
కార్పొరేషన్ ముట్టడి.. ఉద్రిక్తత..
బల్దియా సమస్యల పరిష్కారానికి, కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నాచౌక్ లో ధర్నా అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎమ్మెల్యే, బిజెపి కార్పొరేటర్లు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ధన్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చే వరకు జరిగేది లేదని హెచ్చరించి బైఠాయించారు. అనంతరం కమిషనర్ దిలీప్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు 28 మంది, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, ఆయా మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు.





























