ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులకు భద్రత కరువు

ఆర్‌అండ్‌బీ సర్కిల్‌ కార్యాలయంలో కూలిన పైకప్పు సీలింగ్‌

తప్పిన పెను ప్రమాదం

వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 28, ప్రతిపక్షం : ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులకు భద్రత కరువైంది. వనపర్తి ఆర్‌అండ్‌బీ సర్కిల్‌ కార్యాలయం ప్రమాదానికి నిలయంగా మారినా అధికారుల నిర్లక్ష్యం వీడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ గది పైకప్పు సీలింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. సీలింగ్‌తోపాటు ఇనుప ఫ్రేములు పెద్ద శబ్దంతో నేలపై పడటంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.ఒక గది పైకప్పే కూలిపోయిన తర్వాత కూడా మిగతా గదుల్లో ఉద్యోగులతో విధులు కొనసాగించడం ఎంతవరకు సమంజసమని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.భవనం శిథిలావస్థకు చేరిందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏ క్షణంలో ఏ భాగం కూలుతుందో తెలియని భవనంలో ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి విధులు కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉద్యోగుల ప్రాణాలకు విలువ లేదా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైకప్పు కూలిన ఘటనతోనైనా అధికారులు కళ్లు తెరవాలని ఉద్యోగులు కోరుతున్నారు. వెంటనే భవనాన్ని నిపుణులతో తనిఖీ చేయించి, ప్రమాదకరమని తేలితే కార్యాలయాన్ని ఖాళీ చేయించాలే తప్ప మరో ప్రాణహాని కోసం ఎదురుచూడకూడదని డిమాండ్‌ చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News