వెల్టూరుకు విద్యా వరం

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

రూ.12.75 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌

శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

వనపర్తి ప్రతినిధి , సెప్టెంబర్ 28, ప్రతిపక్షం: పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దమందడి మండలం వెల్టూరులో రూ.12.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌కు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.వనపర్తి మండలం చిట్యాల పరిధిలో రూ.10 కోట్లతో నిర్మించనున్న జ్యోతిబా పూలే బాలుర గురుకుల కళాశాల భవనానికి కూడా శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు ప్రజాపాలన ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులకు మద్దతు ధర, రైతుభరోసా, రుణమాఫీ, సన్నబియ్యానికి బోనస్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు మరిన్ని నియామకాలకు చర్యలు చేపడుతున్నామన్నారు.

వెల్టూరుకు మండల హోదా

వెల్టూరు అతిపెద్ద గ్రామమని, దీనిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి విజ్ఞప్తిపై త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్త మండలాలు, డివిజన్ల ఏర్పాటుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, డీఈఓ యాదయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News