ఓటు విలువ తెలుసుకోండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి!

భావి ఓటర్లకు ఎన్నికల ప్రక్రియపై చైతన్యం

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కుపై అవగాహనే పునాది!

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వ్యాసరచన, క్విజ్ పోటీలు

విజేతలకు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీలు..

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవార్డులు

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 12: ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి పౌరుడికి ఓటు హక్కుపై సంపూర్ణ అవగాహన ఉండాలని రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రధానాచార్యుడు బూరం అభినవ్ పేర్కొన్నారు. భావి ఓటర్లుగా ఎదుగుతున్న విద్యార్థులకు విద్యార్థి దశలోనే ఎన్నికల ప్రక్రియ, ఓటరు నమోదు, ఓటు వినియోగంపై చైతన్యం అవసరమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను విద్యార్థులకు తెలియజేసే లక్ష్యంతో పాలిటెక్నిక్ లో గురువారం వ్యాసరచన, ప్రశ్నావళి (క్విజ్) పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, సిద్ధిపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సూచనల ప్రకారం విద్యాసంస్థల్లో ఎన్నికల అక్షరాస్యత సామాజిక వేదికలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ లో ‘భారతదేశం – ఎన్నికలు’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు.

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల నిర్వహణ విధానం, ఓటరుగా నమోదు చేసుకునే ప్రక్రియ, ఓటు హక్కు ప్రాధాన్యత, ఎన్నికల్లో ఓటు వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) ద్వారా ఓటు వేసే విధానం, ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల పాత్రను వివరించారు. విద్యార్థుల్లో ఎన్నికల పట్ల ఆసక్తి పెంపొందించి వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడం, భవిష్యత్తులో ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా వారిని చైతన్య పరచడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని కళాశాల ప్రధానాచార్యుడు అభినవ్ వివరించారు. ఈ పోటీల్లో విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు తదుపరి శాసనసభ నియోజకవర్గ స్థాయిలో, అనంతరం జిల్లా స్థాయిలో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధిపతులు సయ్యద్ షాహబాజ్, పాతూరి శ్రీనివాస రెడ్డి, వేముల రామకృష్ణ, వై.రాజు, ఏవో రాజేశ్ తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పోటీల్లో విజేతలైన విద్యార్థులను అభినందించారు.

Related News

Latest News