మన పోలీస్ – మన ఊరు కార్యక్రమంలో భాగంగా హబ్సిపూర్ ప్రభుత్వ పాఠశాల సుందరీకరణ

ప్రతిపక్షం దుబ్బాక నవంబర్ 12: ‘మన పోలీస్ – మన ఊరు’ కార్యక్రమంలో భాగంగా దుబ్బాక మండలంలోని హబ్సిపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణను దుబ్బాక పోలీసులు సుందరంగా తీర్చిదిద్దారు.ఇటీవల దుబ్బాక పట్టణ పర్యటనకు విచ్చేసిన పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ హబ్సిపూర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను మరింత ఆహ్లాదకరంగా, విద్యార్థులకు అనువుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తించారు.సీపీ ఆదేశాల మేరకు, ‘మన పోలీస్ – మన ఊరు’ కార్యక్రమంలో భాగంగా దుబ్బాక పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాల ప్రవేశ ద్వారపు బోర్డుకు మరియు ప్రహరీ గోడలకు కొత్తగా రంగులు వేయించారు. దీనివల్ల పాఠశాల ఆవరణ ఎంతో ఆకర్షణీయంగా, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా రూపుదిద్దుకుంది.

ఈ సందర్భంగా గురువారం సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లను, ప్లాస్టిక్ రీసైకిల్డ్ పెన్సిళ్లను పంపిణీ చేశారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించడంతో పాటు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ‘డయల్ 112’ సేవల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. పోలీసుల సామాజిక సేవా కార్యక్రమాల పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక సీఐ రాజేష్, దుబ్బాక ఎస్సై కీర్తి రాజు, మిరుదొడ్డి ఎస్సై సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News